బీజేపీ దారిలో కాంగ్రెస్.. ప్రగతి భవన్ కాదు ప్రజా పాలన భవన్
తాజాగా ప్రగతి భవన్ పేరును ప్రజా పాలన దర్బార్‌గా మారుస్తామంటూ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజా పాలన భవన్ తలుపులు 24x7 తెరిచే ఉంటాయని ట్వీట్ చేశారు.
నగరాలు, కట్టడాల పేర్లు మార్చుతాం.. ఈ మాట వినగానే ఠక్కున గుర్తొచ్చేది బీజేపీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. తాజాగా తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలను కాపీ కొట్టి వాటి పేర్లు మార్చి అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ కూడా బీజేపీ దారిలో వెళ్తోందంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువస్తామని ప్రకటించింది. జనగామ జిల్లా పేరును సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చింది. కల్యాణ లక్ష్మీ స్థానంలో ఇందిరా గిఫ్ట్ స్కీమ్ తీసుకువస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఆసరా పథకం పేరును చేయూతగా మారుస్తామంటూ హామీ ఇచ్చింది.
ఇక తాజాగా ప్రగతి భవన్ పేరును ప్రజా పాలన దర్బార్‌గా మారుస్తామంటూ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజా పాలన భవన్ తలుపులు 24x7 తెరిచే ఉంటాయని ట్వీట్ చేశారు. సీఎం, మంత్రులు రెగ్యులర్‌గా ప్రజా దర్బార్ నిర్వహిస్తారని.. 72 గంటల్లోగా వారి సమస్యలు పరిష్కరిస్తారని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక బీజేపీ మేనిఫెస్టోలను పేర్ల మార్పు హామీ ఉంటుందని తెలుస్తోంది. తెలంగాణలోని పలు నగరాల పేర్లు మార్చుతామని హామీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.