రైతుభరోసాకు కోతలు పెట్టేందుకు సర్కారు కుస్తీలు పడుతోంది

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలనడం రైతులను అవమానించడమే : మాజీ మంత్రి హరీశ్‌ రావు

Advertisement
Update:2025-01-01 17:59 IST

రైతుభరోసాకు కోతలు పెట్టేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి కుస్తీలు పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రైతు భరోసా కోసం రైతులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని కోరడం అంటే వారిని అవమానించడం కాదా అని ప్రశ్నించారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెట్టడం ఏమిటని నిలదీశారు. రెండు పంటలకు కలిపి రైతులందరికీ ఏడాదికి ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సాగు చేసే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని ప్రభుత్వం లీకులు ఇస్తోందని.. అంటే అల్లం, చెరకు, పసుపు లాంటి పంటలు సాగు చేసే రైతులకు రెండో విడత సాయం చేయకుండా వాళ్ల కడుపు కొడతారా అని ప్రశ్నించారు. రూ.2 లక్షలకు పైన అప్పు ఉన్న రైతులు ఈ ముఖ్యమంత్రి మాటలు నమ్మి లోన్‌ చెల్లిస్తే వారి రుణాలు మాఫీ కాలేదన్నారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేల సాయం చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. సాయం అందించే కూలీలకు కోత పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉపాధి హామీ పథకంలో పనికి పోతున్న 1.04 కోట్ల మందికి రూ.12 వేల చొప్పున సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

క్రైమ్ రేట్ లో తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్‌లోకి వెళ్లిందని ఇది ఎంతో బాధాకరమన్నారు. దేశానికే ట్రైనింగ్ ఇచ్చిన తెలంగాణ పోలీసులను ఈరోజు రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకుంటున్నారని అన్నారు. పోలీసుల ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి దెబ్బతీస్తున్నారని, పోలీసుల లోగోలను మార్చడం కాదు.. వారికి అవసరమైన సాంకేతికత, నిధులు అందించాలని డిమాండ్‌ చేశారు. ఆరోగ్య భద్రత కార్డు కింద గడిచిన ఏడాది ఎంతమంది పోలీసులకు ట్రీట్‌మెంట్‌ చేశారనే లెక్కలతో వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏక్‌ పోలీస్‌ విధానం ఏమైందని ప్రశ్నించారు. తొలగించిన పోలీసులను, సస్పెండ్‌ చేసిన వారిని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్‌ రేట్‌ 23 శాతానికి పెరిగిందని, రేప్‌ కేసులు 29 శాతం, దళితులు, గిరిజనులపై అత్యాచారాలు 12 శాతం పెరిగాయన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు పోలీసులకు 15 వేల కొత్త వాహనాలు, ప్రతి నెల పోలీస్‌ స్టేషన్ల మెయింటనెన్స్‌ కు నిధులిచ్చి క్రైం రేట్‌ కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. ఇప్పుడు క్రైమ్‌ రేట్‌లో బిహార్‌ను తెలంగాణ దాటిపోవడం విచారకరమన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2022లో 6,429 కేసులు నమోదు అయితే 2024లో 7,563 కేసులు పెట్టారని.. అంటే ఈ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఎన్ని అక్రమ కేసులు పెట్టిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News