రేపు అమరుల స్మారకం ప్రారంభం.. రాష్ట్రానికి ఇదొక నూతన చిహ్నం

తెలంగాణకు ఎవరైన దేశవిదేశీ ప్రతినిధులు వస్తే.. ముందుగా అమర వీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది.

Advertisement
Update:2023-06-21 07:26 IST

తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమర వీరులకు గుర్తుగా హైదరాబాద్ నడిబొడ్డున నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా అమరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం సెక్రటేరియట్ ఎదురుగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ప్రారంభిస్తారు. గాంధీ స్మారకం లాగా అమరుల స్మారకాన్ని తీర్చిదిద్దనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అమరజ్యోతి వద్ద ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి మంగళవారం పరిశీలించారు.

దేశానికి ఎవరైనా విదేశీ ప్రతినిధులు వస్తే.. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. ఇకపై తెలంగాణకు ఎవరైన దేశ విదేశీ ప్రతినిధులు వస్తే.. ముందుగా అమర వీరుల స్మారకం వద్ద నివాళులు అర్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వారిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలనే సీఎం కేసీఆర్ సంకల్పంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

లుంబినీ పార్క్‌ను ఆనుకొని, కొత్త సెక్రటేరియట్ ఎదురుగా నిర్మించిన స్మారక చిహ్నం వద్ద అనేక అధునాత సౌకర్యాలు ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాలు, ఆడిటోరియం, సువిశాలమైన రెస్టారెంట్, 400 కార్లకు సరిపోయే పార్కింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ అనేక రకాలైన బిజినెస్ మీటింగ్స్ , ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉన్నది. రెస్టారెంట్‌లో అన్ని రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. స్మారకం వద్ద ఏర్పాటు చేసిన రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ వల్ల వచ్చే ఆదాయంతో దాని నిర్వహణ ఖర్చులు వస్తాయని మంత్రి చెప్పారు.

ఒకప్పుడు ఇదే ప్రదేశంలో ఉమ్మడి పాలకులు అవమానాలకు గురి చేశారు. జలదృశ్యం వద్ద పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తే.. ఖాళీ చేయించారు. కానీ ఇప్పుడు అక్కడే అమరుల స్మారకాన్ని నిర్మించుకోనుండటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఎక్కడైతే అవమాన పడ్డామో.. అక్కడే అమరుల స్మారకాన్ని భారీగా నిర్మించి సీఎం కేసీఆర్ తన సంకల్పాన్ని చాటుకున్నారని చెప్పారు.

అమరుల స్మారక నిర్మాణం కోసం జర్మనీ నుంచి ప్రత్యేకంగా స్టెయిన్‌లెస్ స్టీల్ తెప్పించారు. దుబాయ్‌కి చెందిన కంపెనీ.. ఈ నిర్మాణాలను ప్రత్యేకంగా మౌల్డింగ్ చేసింది. భవనానికి చుట్టూ ఏర్పాటు చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్‌కు దాదాపు 4 వేల నుంచి 5వేల మౌల్డింగ్‌లు ఉన్నాయి. 100 టన్నులకు పైగా స్టీల్‌ను ఉపయోగించాము. ఇంత భారీ స్టెయిన్‌లెస్ స్టీల్ కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేవు. అమర జ్యోతి ఎప్పటికీ నిలిచిపోయే విధంగా కార్బన్ స్టీల్‌తో నిర్మించారు. ఎటువైటి వాతావరణాన్ని అయినా తట్టుకొని, తుప్పు పట్టకపోవడం ఈ నిర్మాణం ప్రత్యేకత అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

రాబోయే రోజుల్లో హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక చిహ్నం గొప్ప పర్యాటక కేంద్రాలుగా మారతాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన సచివాలయానికి తోడు.. హుస్సేన్ సాగర్ పరిసరాలు, బుద్దుని విగ్రహం, లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వంటివి ఇప్పుడు మరింత శోభను సంతరించుకుంటాయని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News