ఫార్మా విలేజ్ లు.. 5 లక్షల ఉద్యోగాలు

మెదక్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

Advertisement
Update:2024-02-28 07:31 IST

హైదరాబాద్‌లో 21వ బయో ఏసియా సదస్సుని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో జీనోమ్‌ వ్యాలీ రెండో దశను 300 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టబోతున్నట్టు తెలిపారాయన. 2 వేల కోట్ల రూపాయలతో దానిని అభివృద్ధి చేస్తామని, 10 ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, 5 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ సైంటిస్టులు, విదేశీ ప్రతినిధులు ఈ బయో ఏసియా సదస్సుకి హాజరయ్యారు.


ఫార్మా విలేజ్ లు ఎక్కడెక్కడంటే..?

మెదక్, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్‌ ఫీల్డ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఆయా ప్రాంతాలకు కేవలం గంటన్నర లోపే ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో మూడు విభిన్న ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారాయన. పరిశోధనలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తామని, మౌలిక సదుపాయాలను మెరుగు పరచి, సంపూర్ణమైన వ్యవస్థను రూపొందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు రేవంత్ రెడ్డి.

రాకెట్ లా పనిచేస్తాం..

పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలు.. నింగిలోని తారల వద్దకు చేరాలని కలలు కంటే, వారిని అక్కడికి తీసుకెళ్లే రాకెట్‌ లా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారాయన. బయో ఏసియా సదస్సులో పలు దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించాలని, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. వచ్చే మూడేళ్లలో రీజనల్‌ రింగ్‌ రోడ్‌ను పూర్తి చేస్తామన్నారు. జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. వెస్ట్రన్‌ ఆ్రస్టేలియా మంత్రి సాండర్సన్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హెల్త్‌ కేర్‌ రంగంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు సాండర్సన్ తెలిపారు. భారత్‌లో తమ తొలి కమర్షియల్‌ ఆఫీస్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News