ఢిల్లీలో అపాయింట్‌మెంటే లేదు.. ఇక్కడ మాత్రం ఉపన్యాసాలు దంచాడు
వరంగల్‌లో బీఆర్‌ఎస్‌పై రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం
ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ప్రజలకు చాలా హామీలు ఇచ్చిందని బీఆర్‌ఎస్ నేతలు ధ్వజమెత్తారు. నిన్న వరంగల్‌లో జరిగిన సభా సాక్షిగా రేవంత్‌రెడ్డి రైతులను, పేదలను ఆదుకునేలా వరాలు కురిపిస్తారనుకుంటే మాయమాటలతో కాలం వెళ్లదీశారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, పేదలను ఆదుకోవాల్సిన సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారుమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. మహిళలను ప్రోత్సహించింది కేసీఆర్ అన్నారు. మహిళల అభివృద్ధి ఏడాది కాలంలో రేవంత్‌రెడ్డి ఏ ఒక్క కార్యక్రమైనా చేపట్టాడా? అని ప్రశ్నించారు. కానీ మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారు. కోటీశ్వరులు అయ్యేది మీ అన్నలు, తమ్ముడు, మీ అల్లుల్లు, మీ వియ్యంకుల కోసమే కృషి చేస్తున్నాడని విమర్శించాడు. రాహుల్ గాంధీ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్‌లో ఏం అమలు చేశాడో చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఢిల్లీలో రేవంత్‌కు అపాయింట్‌మెంటే దొరకడం లేదని, కానీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు దంచుతున్నాడని ఎద్దేవా చేశాడు. వరంగల్ సభే రేవంత్‌రెడ్డి కౌంట్ డౌన్‌కు నిదర్శనమని ఎమ్మెల్సీ మధుసూదనాచారీ అన్నారు. మీ మంత్రుల మధ్య సమన్వయం, సహకారం లేదన్నారు. తెలంగాణలో అన్నివర్గాల ప్రజలకు రోడ్డెక్కారు. స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రజలు జైలు పాలు చేయబడుతున్నారు. వారిని పరామర్శించే పరిస్థితిలో రేవంత్‌రెడ్డి లేడంటే ఎంత నిరంకుశంగా పాలన సాగుతున్నదో తెలుస్తోంది అన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిగిలిన 20 లక్షల మందికి రుణమాఫీకి సంబంధించి ప్రకటన చేస్తాడని అనుకున్నాం. పత్తి, వరికి కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.