కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

అటవీ అనుమతులు, ఎలక్ట్రిక్‌ మోడల్‌లోని మార్చేందుకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి

Advertisement
Update:2025-01-16 21:52 IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం రాత్రి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తో ఆయన ఆఫీస్‌లో సమావేశమయ్యారు. తెలంగాణలో 161 ప్రాజెక్టులు అటవీశాఖ అనుమతులు లేని కారణంగా నిలిచి పోయాయని, వాటిని వీలైనంత త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. 38 ప్రాజెక్టులు వన్యప్రాణి సంరక్షణ చట్టాలకు సంబంధించిన అనుమతులు రాకపోవడంతో ఆగిపోయాయని.. వాటిని ఇప్పించాలని కోరారు. నేషనల్‌ హైవేస్‌, ఏజెన్సీ ఏరియాల్లో టవర్ల నిర్మాణం, ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజనలో భాగంగా రోడ్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలను కలిపే రోడ్ల నిర్మాణాలు, గౌరవెల్లి ప్రాజెక్టుకు అనుమతులు ఇప్పించాలని కోరారు.

హైదరాబాద్‌లో తిప్పే బస్సులను వందశాతం ఎలక్ట్రిఫికేషన్‌ చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రికి రేవంత్‌ వివరించారు. గురువారం సాయంత్రం ఆయనతో సీఎం భేటీ అయ్యారు. పీఎం ఈ - డ్రైవ్‌ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించాలని ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించామన్నారు. ఇప్పుడున్న డీజిల్‌ బస్సులకు ఎలక్ట్రిక్‌ కిట్‌ ఏర్పాటు చేసి ఫిట్‌మెంట్‌ పద్ధతిలో ఎలక్ట్రిక్‌ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉందని, దీనిని పరిశీలించి సానుకూల నిర్ణయం ప్రకటించాలని కోరారు. కేంద్రం కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్‌మెంట్‌ మోడల్‌ కింద కేటాయించాలని కోరారు. సీఎం వెంట మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు ర‌ఘువీర్ రెడ్డి, బ‌ల‌రాం నాయ‌క్‌, సీఎస్‌ శాంతికుమారి, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ వి.శేషాద్రి, అడ్వైజర్‌ శ్రీనివాస రాజు, ఆర్ అండ్ బీ స్పెషల్‌ సీఎస్‌ వికాస్ రాజ్‌, పీసీసీఎఫ్‌ డొబ్రియల్‌ తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ తదితరులు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News