పంచాయతీ ఎన్నికలు అప్పుడే.. రేవంత్ కీలక ఆదేశాలు
బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.
కొద్దిరోజుల్లోనే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆగస్టు చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు, ఐదేళ్ల క్రితం కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఈ ఎన్నికలూ నిర్వహించాలన్నారు సీఎం. శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం కిందటే ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున.. దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత సమయం తీసుకుంటారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బిహార్‌లో 2023లో కులగణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసినా వివరాలు ఇంకా బయట పెట్టలేదని అధికారులు వివరించారు. మనదగ్గర కులగణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.