మాదిగలకు రేవంత్ కొత్త హామీలు.. నమ్ముతారా..?
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి - MRPS నేత మందకృష్ణ మాదిగ సైతం తన సామాజికవర్గానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కేటాయించకపోవడంతో మాదిగ సామాజికవర్గం రేవంత్ సర్కార్‌పై ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆ సామాజికవర్గాన్ని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు రేవంత్. ఈ మేరకు తనను కలిసిన మాదిగ సామాజికవర్గ నేతలు పిడమర్తి రవి, గజ్జెల కాంతంతో చర్చించిన రేవంత్.. వారికి పలు హామీలు ఇచ్చారు.
రాజ్యసభ సీటుతో పాటు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు రేవంత్. నామినేటెడ్ పోస్టుల్లోనూ మాదిగలకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఎస్సీ సామాజికవర్గీకరణకు కట్టుబడి ఉన్నామని.. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దళితబంధు ప్రోసీడింగ్స్ ఇవ్వకుంటే లక్ష మందికిపైగా దళితులతో అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు. మరోవైపు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి - MRPS నేత మందకృష్ణ మాదిగ సైతం తన సామాజికవర్గానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడంతో రేవంత్ సర్కార్‌ను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.
తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ పార్లమెంట్ స్థానాలుండగా.. మూడు స్థానాల్లోనూ మాలలకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. నాగర్‌కర్నూలు నుంచి మల్లు రవి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి కడియం కావ్యకు అవకాశమిచ్చింది కాంగ్రెస్. ఇక ఉపఎన్నిక జరగనున్న కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి శ్రీ గణేష్‌కు టికెట్ ఇచ్చారు. ఆయన ఎస్సీ అయినప్పటికీ మాదిగ సామాజికవర్గం కాదు.