సవాళ్లు వచ్చినపుడే మన సత్తా చాటాలి -కేసీఆర్

నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం కేసీఆర్. ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి.. ప్రజలకు అందించాలని చెప్పారు.

Advertisement
Update:2023-07-03 07:00 IST

"సంక్షోభ సమయంలోనే పంటలు పండించి చూపించాలి. అప్పుడే మనం సిపాయిలం. ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోండి." అంటూ అధికారులకు మార్గనిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో తెలంగాణ నీటి ప్రణాళికను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు వచ్చే అవకాశముందని, తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదనన్నారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీదున్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


కష్టకాలంలోనే కాళేశ్వరం విలువ..

ఇది మునుపటి తెలంగాణ కాదని, గతంలో లాగా ఆలోచిస్తే కుదరదని, నీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నామని, వాటి సామర్థ్యం ఏంటనేది అందరికీ తెలియాల్సిన సందర్భం వచ్చిందని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. కష్టకాలంలోనే కాళేశ్వరం విలువ తెలిసొస్తుందని, సంక్షోభ సమయంలోనే పంటలు పండించి చూపించాలన్నారు. అధికారులు తమని తాము నిరూపించుకోవాలని, వారి పరిజ్ఞానాన్ని అంతా వినియోగిస్తూ ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కరువు పరిస్థితుల్ని సవాలుగా తీసుకోవాలన్నారు. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుందని చెప్పారు.

సమన్వయం అవసరం..

నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం కేసీఆర్. ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి.. ప్రజలకు అందించాలని చెప్పారు. ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను ఎప్పటికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోస్తూ.. మిడ్‌ మానేరును నింపాలని సూచించారు. అక్కడి నుంచి లోయర్‌ మానేరు డ్యామ్‌ కు సగం నీళ్లను, వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీకి సగం నీళ్లను ఎత్తిపోయాలని చెప్పారు. కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యాపేట దాకా, ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్‌ నిర్వహణను ప్రైవేటు కాంట్రాక్టర్లకు కాకుండా ప్రభుత్వరంగ సంస్థ అయిన జెన్‌ కో కు ఇచ్చేలా విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు సీఎం కేసీఆర్.

విత్తనాలు, ఎరువులు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. దీనిపై ప్రతిరోజు ఉదయాన్నే సీఎం కార్యాలయానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేస్తుందని, తద్వారా రైతాంగం ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News