మహాత్ముడు పుట్టిన గడ్డపై మరుగుజ్జుల గర్జనలా?. జైల్లో పుట్టిన జనతానే జెండా ఎగరేసింది. గుర్తు పెట్టుకోండి..

అంబేద్కర్‌ బతికే ఉంటే ఈరోజు ఏ స్థాయిలో పోరాటం చేసి ఉండేవారోనన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజాసామ్యంలో అధికారం అంటే బాధ్యత అన్న విషయాన్ని కూడా కేంద్రం విస్మరిస్తోందన్నారు.

Advertisement
Update:2022-09-12 13:43 IST

తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. బీజేపీకి చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. జాతీయ జెండానే మార్చేస్తామని మాట్లాడుతున్నారని.. మహ్మాత్ముడు పుట్టిన ఈ గడ్డపై ఈ మరుగుజ్జులు వచ్చి చంపేస్తాం, నరికేస్తాం అంటున్నారని అభ్యంతరం తెలిపారు. మరే రాజకీయ పార్టీలను ఉంచం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మునుగోడులో బహిరంగ సభలో మాట్లాడారన్నారు. ఇంతటి అప్రజాస్వామికమైన ప్రకటన కేంద్ర హోంమంత్రి నుంచి రావొచ్చా అని ప్రశ్నించారు.

శాంతికి, సహనానికి మారుపేరైన మన దేశంలో, అహింసతో స్వరాజ్యం సాధించిన ఈ నేలలో ఇలాంటి మాటలా అని కేసీఆర్ నిలదీశారు. ఇప్పటి వరకు బీజేపీకి ఏనాడు 50 శాతం ఓట్లు రాలేదని కేవలం 36 శాతం ఓట్లతో దేశాన్ని ఏలుతూ ఇంత అహంకారమా అని ప్రశ్నించారు. హిట్లర్‌, నెపోలియన్, ముస్సోలి లాంటి వారే కాలగర్భంలో కలిసిపోయారని.. అధికారం నెత్తికెక్కిన వారికి కాలం చాలా కఠినంగా సమాధానం చెబుతుందన్నారు. అది కూడా ఎంతో కాలం లేదని మరో 20 నెలలే ఉందని దేవుడు కూడా బీజేపీని కాపాడే పరిస్థితి ఇక లేదన్నారు. పద్దతి పాడు లేకుండా మోకాలు ఎత్తోడు, అరికాలు ఎత్తోడు.. ఇలా ప్రతోడు ముఖ్యమంత్రిని, మంత్రులను గౌరవం కూడా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు.

బుద్ధుడు పుట్టిన నేలపై ఈ ప్రబుద్ధుల మాటలతో భారత మాత హృదయం గాయపడుతోందన్నారు. ఇతర దేశాలకు వెళ్తే గాంధీ పుట్టిన దేశం నుంచి వచ్చారా అని గౌరవం ఇస్తారని.. కానీ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నది ఏంటని ఆవేదన చెందారు. ఇప్పటికి 11 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేశారని, తెలంగాణలో మూడు తోకలు పెట్టుకుని ఇక్కడ కూడా కూల్చేస్తామంటున్నారని.. ఎలా కూలుస్తారు? ప్రజలు గమనించరా అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

చివరకు తమిళనాడులోనూ ఏక్‌నాథ్‌ షిండే వస్తాడని అక్కడి బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఈ షిండేలు ఎలా పుట్టుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇంత బహిరంగంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీరికి పోయే కాలం దాపురించిందని అర్థమన్నారు. ఒకప్పుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ ఒక్క పిలుపు ఇస్తే 40 రోజుల్లో దేశమే కదిలిందని.. జైళ్లలో పుట్టిన జనతా పార్టీనే దేశంలో జెండా ఎగరేసిందని గుర్తు చేశారు. చివరకు మన దేశ దౌత్యవేత్తలను ఇతర దేశాల వారు పిలిచి పిచ్చిపిచ్చిగా ఉందా అని బెదిరించే స్థాయికి మోడీ దేశ ప్రతిష్టను తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ను కలిసేందుకు గతంలో ఒకసారి తెలంగాణ మంత్రులు వెళ్తే.. '' ఎందుకయ్యా మీరు పింఛ‌న్‌ రూ.2వేలు ఇస్తున్నారు.. మేం గుజరాత్‌లో రూ. 600లే ఇస్తున్నాం అయినా మేం గెలవలేదా?. రైతు బంధు ఎందుకిస్తున్నారు?. ఏ రాష్ట్రం చేయనిది మీరే చేస్తున్నారు. మీరేం పెద్ద సిపాయిలా?'' అని హేళన చేశారని కేసీఆర్ వివరించారు. తమ దేశ ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని మీ స్నేహితుడు అదానీకి తమను దోచిపెట్టవద్దంటూ శ్రీలంకలో ప్రజలు మోడీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని ఇది దేశం పరువు తీసే అంశమన్నారు.

అంబేద్కర్‌ బతికే ఉంటే ఈరోజు ఏ స్థాయిలో పోరాటం చేసి ఉండేవారోనన్నారు. ప్రజాసామ్యంలో అధికారం అంటే బాధ్యత అన్న విషయాన్ని కూడా కేంద్రం విస్మరిస్తోందన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అడ్డుపడినా ఆ గందరగోళం మధ్యనే చట్టాలను ఆమోదించుకుని వెళ్లిపోతున్నారన్నారు. ఎదుటి వారు చెప్పిదే కనీసం వినే సంస్కారం కూడా కేంద్ర ప్రభుత్వంలో లోపించిందన్నారు. మీటర్లు లేకుండా రైతులకు విద్యుత్ కనెక్షన్‌లే ఇవ్వొద్దని కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లోనే ఉందన్నారు.

మీటర్లు పెడితే తెలంగాణ రైతాంగం నాశనమవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ మీటర్లు పెట్టనివ్వబోమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ మీటర్లకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారని వివరించారు. చట్టం తెచ్చింది బీజేపీ కాదు కదా కేంద్ర ప్రభుత్వం కదా అని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని.. అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, బీజేపీకి మధ్య ఏమైనా గ్యాప్‌ ఉందా అని ప్రశ్నించారు.

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే తొక్కి చంపేస్తామన్నట్టుగా కేంద్రం బెదిరిస్తోందన్నారు. ఆర్టీసీని అమ్మేయాలని లేఖల మీద లేఖలు రాస్తోందంటూ ఆ లేఖలను అసెంబ్లీలో కేసీఆర్ చూపించారు. అలా కేంద్రం చెప్పినట్టే అమ్మేస్తే వెయ్యి కోట్ల అప్పు ఇస్తామంటూ ఆఫర్లు పెడుతున్నారని సీఎం వివరించారు.

టన్ను నాలుగు వేలకు దొరుకుతున్న బొగ్గును కాదని.. మోడీ సన్నిహిత వ్యాపారి నుంచి రూ. 30వేలకు కొనించేలా కేంద్ర విద్యుత్ సంస్కరణ ఉందన్నారు. ఇదెక్కిడి న్యాయం అని ప్రశ్నించారు. అలా కొనకపోతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్‌ను ఇవ్వబోమని రాష్ట్రాలను బెదిరిస్తున్నారని కేసీఆర్ సభకు వివరించారు.

ఇక్కడ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలోనే అక్కడ మోడీ కూడా ప్రధాని అయ్యారని.. ఆ సమయంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్లు అని.. జాతీయ తలసరి వినియోగం 957 యూనిట్లు అని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత చూస్తే తెలంగాణ విద్యుత్ తలసరి వినియోగం 2126 యూనిట్లకు పెరిగిందన్నారు. మోడీ వచ్చిన తర్వాత జాతీయ స్థాయి తలసరి విద్యుత్ వినియోగం 1250కి మాత్రమే పెరిగిందన్నారు. విశ్వగురువు అని చెప్పుకునే మోడీ నాయకత్వంలో ఎనిమిదేళ్లలో కేవలం 290 యూనిట్లు మాత్రమే తలసరి వినియోగం పెంచగలిగారన్నారు. భూటాన్‌లోనూ తలసరి విద్యుత్ వినియోగం కూడా 3126 యూనిట్లు ఉందన్నారు. 140 దేశాల్లో గణాంకాలను సేకరించి ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ జాబితాను ప్రచురించగా.. మన దేశం ఏకంగా 104వ స్థానంలో ఉందన్నారు. ఇదీ విశ్వగురువు ఘనత అని.. ఈ విశ్వగురువును ఇలాగే కొనసాగిస్తే ఇక విషమే మిగులుతుందన్నారు.

మీటర్లు పెడితే 98 లక్షల కుటుంబాలు దెబ్బతింటాయన్నారు. రైతులు, దళితులు, గిరిజనులు, బట్టల తయారీ, కోళ్ల పెంపకం వంటి సబ్సిడీ తీసుకుంటున్న రంగాలన్నీ ప్రభావానికి గురవుతాయన్నారు. విద్యుత్ రంగంలో ఈ దేశంలో 20 లక్షల మంది పనిచేస్తున్నారని.. ఈ చట్టం దెబ్బకు వారి గోచిలన్నీ ఊడిపోతాయన్నారు. ఇప్పటికే అన్ని రంగాలను అమ్మేశారని మిగిలింది వ్యవసాయం, విద్యుత్ అని.. ఈ రెండు రంగాలను షావుకార్లకు అమ్మే వరకు నిద్రపోం అన్నది కేంద్ర ప్రభుత్వ శపథమని అసెంబ్లీలో కేసీఆర్ వివరించారు. అందుకే ఇలాంటి చట్టాలను తెస్తున్నారని మండిపడ్డారు.

ఎరువులు, విద్యుత్‌, డిజిల్‌ ధరలు పెంచి.. దాని ద్వారా దున్నే ధరలు, కోసే ధరలు అన్నీ పెరగాలి చివరకు భరించలేక రైతులు వ్యవసాయం మానేయాలి.. అప్పుడు రైతులు భూములను కార్పొరేట్లకు అప్పగించాలన్నది కేంద్ర ప్రభుత్వ కుట్ర అని కేసీఆర్‌ ఆరోపించారు.

నూకలు కూడా ఎగుమతి చేయవద్దని కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించి రైతుల నోట్లో మట్టికొట్టిందన్నారు. యూరప్‌తో పాటు పలు దేశాల్లో ఆహార డిమాండ్ ఉందని.. ఇలాంటి సమయంలో ఎగుమతులపై బ్యాన్‌ పెట్టి రైతులకు కనీస మద్దతు ధర రాకుండా గండికొట్టారన్నారు. కనీసం ఇంగితజ్ఞానం లేకపోవడం వల్లనే దేశానికి అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారని కేసీఆర్‌ విమర్శించారు. ప్రతిరంగాన్ని ఇదే తరహాలో నాశనం చేస్తూ వస్తున్నారన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను కూడా సమర్ధవంతంగా అందించే స్థితిలో కేంద్రం లేదన్నారు. మేకింగ్ ఇండియా అంటూనే మోటార్ల మీటర్ల నుంచి జాతీయజెండాల వరకు చైనా నుంచే దిగుమతి చేసుకునే పరిస్థితిని తెచ్చారన్నారు.

Tags:    
Advertisement

Similar News