తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వమే
రాష్ట్ర ప్రజల గొంతుకై ఉభయసభల్లో బలంగా వాణి వినిపించి గట్టిగా పోరాడాలని నిర్ణయించిన బీఆర్‌ఎస్‌ఎల్పీ
తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? సమస్యలు, పరిష్కారాలపై దృష్టి సారించాలి గాని మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని ప్రశ్నించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రజల గొంతుకై ఉభయసభల్లో బలంగా వాణి వినిపించి గట్టిగా పోరాడాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ నిర్ణయించింది. సమస్యలు, హామీలలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని, నాడు రైతుబంధు, ఫార్మాసిటీ ఉద్దేశాలను, ప్రయోజనాలను అందరికీ వివరించాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పును మూర్ఖపు చర్యగా అభివర్ణించిన కేసీఆర్ ఉద్యమ సమయంలో విగ్రహ ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులు, నింపిన స్ఫూర్తి గురించి అందరికీ వివరించాలని సూచించారు.
ఆదివారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వివిధ రంగాల్లో నెలకొన్న సమస్యలు ప్రభుత్వ వైఖరిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ, కౌన్సిల్ వేదికగా అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలను సుదీర్ఘంగా వివరించారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. నాడు రైతు బంధు తెచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. రైతులకు సాయం అందించకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో వైఫల్యం చెందిందని, రానున్న రోజుల్లో సర్కార్‌కు ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయని సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురుకులాలు, విద్యా రంగంలో వైఫల్యాలను నిలదీయాలన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నివాసాలను కూలగొడుతున్నది అనేది ఎంతమాత్రం క్షమించరానిదని అన్నారు.హైడ్రా ముసుగులో పేదల ఆవాసాలను బుల్డోజర్లతో నిలువునా కూల్చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఉభయ సభల్లో ఎండగట్టాలన్నారు. నిర్బంధ పాలన గురించి సమావేశాల్లో ప్రశ్నించాలని..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రొటోకాల్ విషయంలో నిలదీయాలని చెప్పారు. లగచర్ల రైతులపై దాడులు, భూసేకరణ గురించి నాడు ఫార్మాసిటీ ఎందుకు ప్రతిపాదించింది? పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను స్పష్టం చేయాలని సూచించారు. ఫిబ్రవరిలో పార్టీ పరంగా బహిరంగ సభ నిర్వహించి సర్కార్ వైఖరి ఎండగట్టే ఆలోచనలో ఉన్నట్టు కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాత పార్టీ అన్ని కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు చేయానలి భావిస్తున్నట్లు సమావేశంలో వెల్లడించారు. గురుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. గురుకులాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, విద్యార్థులకు న్యాయం చేసేలా పోరాడాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు.
కేసీఆర్‌తో సమావేశం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నెలకొన్న దుర్భర పరిస్థితులు రైతు భరోసా, రుణమాఫీ, బోనస్, రైతు కూలీలకు ఇస్తామన్న హామీల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హామీ ఇచ్చారు. గురుకులాల్లో నెలకొన్న అధ్వాన్న, దుర్భర పరిస్థితులను ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలోని కమిటీ అధ్యయన నివేదికను పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌కు సమర్పించిందన్నారు. దౌర్జన్యంగా ప్రభుత్వం రైతుల మీద దాడి చేస్తూ, హింసిస్తూ, కేసులు పెట్టి నిర్బంధిస్తూ వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదో ఈ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతున్నదో దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. దీంతో అనాలోచితంగా పూర్తి బాధ్యతారాహిత్యంగా, చరిత్ర గురించి, ఉద్యమం గురించి కనీస అవగాహన లేకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మారుస్తామంటూ తెలంగాణ అస్తిత్వంపై ప్రభుత్వం దాడి చేస్తున్నది. ఈ విషయంలోనూ తెలంగాణ ప్రజల్లో విపరీతమైన ఆవేదన ఉందన్నారు. వారి ఆవేదనకు గొంతుగా బీఆర్‌ఎస్ పార్టీ నిలుస్తుందన్నారు. శాసనసభ, మండలిలో నిలదీస్తామన్నారు. తెలంగాణ ప్రజల తరఫున వారిని కొన్ని సూటి ప్రశ్నలు అడుగుతామన్నారు.
హరీశ్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్నిఅవలంబించాలన్నదానిపై చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ రైతులు, రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ విషయంలో అన్నదాతలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. రైతుల పక్షాన పూర్తిస్థాయి రుణమాఫీ జరగాలని, రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ గట్టిగా శాసససభలో, మండలిలో పట్టుబట్టాలని నిర్ణయించింది. బీసీలకు సంబంధించి బీసీ బంధు, దళిత బంధు, గిరిజన బంధు కూడా బంద్ పెట్టారు. వీటన్నింటిపైనా అసెంబ్లీలో చర్చించాలని ఇవాళ్టి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఒకవేళ ప్రభుత్వం దీనిపై కలిసిరాకపోతే అడ్జెన్ట్ మోషన్ తెచ్చి అయినా సరే చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించామన్నారు.