కేసీఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోంది.. లోక్‌సభలో ఎంపీ నామా

కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగాము. గుజరాత్, మహారాష్ట్రలకు కేటాయించినా.. తెలంగాణకు మాత్రం కేటాయించలేదని అన్నారు.

Advertisement
Update:2023-08-09 18:15 IST

తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలోని పథకాలకే పేర్లు మార్చి.. మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. విభజన చట్టం హామీలను 9 ఏళ్లుగా నెరవేర్చాలని కోరుతున్నా.. కేంద్రం మాత్రం మెండి చేయి చూపించిందని ఆరోపించారు.

కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగాము. గుజరాత్, మహారాష్ట్రలకు కేటాయించినా.. తెలంగాణకు మాత్రం కేటాయించలేదని అన్నారు. తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీ కావాలని, నవోదయా విద్యాలయాలు కావాలని ఎన్నో సార్లు లేఖలు రాసినా కేంద్రం పట్టించుకోవాలని చెప్పారు. తెలంగాణ పట్ల మోడీ సర్కార్ వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. చిన్న రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వ తీరు సరిగా లేదని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అన్నాక.. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. తెలంగాణ కూడా దేశంలోని భాగమే కదా.. మరెందుకు ఇలాంటి వివక్ష అని నామా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం స్వశక్తితోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ ఫిల్టర్ వాటర్ అందిస్తున్నాము. నీతి ఆయోగ్ కూడా ఈ పథకాన్ని మెచ్చుకొని రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. మోడీ ప్రభుత్వం ఈ పథకానికి రూపాయి కూడా ఇవ్వకపోగా.. పథకాన్ని కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అంటూ అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని నామా దుయ్యబట్టారు.

సాగుకు తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తోంది. దేశంలో ఇలాంటి పథకం అమలులో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోడీ సర్కారు రద్దు చేసిందని.. దాన్ని గుజరాత్‌కు తరలించుకొని పోయారని నామా మండిపడ్డారు. మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు దేశానికే సిగ్గు చేటని అన్నారు. ఈ ఘటనలతో విదేశాల్లో భారత పరువు మంటగలిసిందని అన్నారు. ప్రధాని మోడీ మణిపూర్‌కు అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్లి.. అక్కడ శాంతిని పునరుద్దరించాలని నామా నాగేశ్వరారవు కోరారు. 

Tags:    
Advertisement

Similar News