చార్మినార్, గోల్కొండకు ఎంట్రీ ఫీజు లేదు..
ముఖ్యంగా చార్మినార్, గోల్కొండ కోటను నిత్యం వేలమంది ప్రవేశ రుసుము చెల్లించి సందర్శిస్తుంటారు. వారందరికీ ఇప్పుడు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. 10రోజులపాటు ఈ అవకాశం ఉంటుంది.
దేశ వ్యాప్తంగా పురావస్తు శాఖ పరిధిలోని 3,400 సందర్శనీయ స్థలాలకు ఎంట్రీ ఫీజు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ అవకాశం ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు ఉంటుందని చెప్పింది. భారతీయులకే కాదు, విదేశీయులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలోని చార్మినార్, గోల్కొండ కోట, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, పిల్లల మర్రి, రామప్ప ఆలయం ఈ లిస్ట్ లో ఉన్నాయి. ముఖ్యంగా చార్మినార్, గోల్కొండ కోటను నిత్యం వేలమంది ప్రవేశ రుసుము చెల్లించి సందర్శిస్తుంటారు. వారందరికీ ఇప్పుడు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. 10రోజులపాటు ఈ అవకాశం ఉంటుంది.
విమర్శలను తప్పించుకోడానికేనా..?
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తోంది కేంద్రం. అదే సమయంలో జాతీయ జెండాలను కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారే విమర్శలను మూటగట్టుకుంటోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. టీఆర్ఎస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. ఏడాది ముందే ఉత్సవాలను ఘనంగా మొదలు పెట్టినా.. ఇప్పటి వరకు జెండాలు సమీకరించలేకపోయారని, మేడిన్ చైనా జెండాలను ఉత్సవాల్లో వాడాల్సిన దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మాత్రం సిరిసిల్ల చేనేత జెండాలను ప్రతి ఇంటిపై ఎగురవేస్తామన్నారు. ఈ క్రమంలో విమర్శలను తప్పించుకోడానికి కేంద్రానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాలి. అందుకే ఈ ప్రకటన చేశారని అంటున్నారు.
ఓవైపు దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పార్లమెంట్ నిరసనలతో అట్టుడుకుతోంది. భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేళ.. ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. గత ప్రభుత్వాన్ని నిందించడానికి ఎలాగూ కేంద్రానికి ఛాన్స్ లేదు. తప్పుల్ని కప్పి పుచ్చుకునే దారి కూడా లేదు. అందుకే ఇలా ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సందర్శనీయ స్థలాల్లో ఉచిత ప్రవేశం అని కేంద్రం ప్రకటించగానే.. ఇటు సెటైర్లు మొదలయ్యాయి. కేంద్రం కవరింగ్ గేమ్ మొదలు పెట్టిందని మండిపడుతున్నారు నెటిజన్లు. నిత్యావసరాలు ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతుంటే.. పర్యాటకులకు ఉచిత ప్రవేశం అంటూ కేంద్రం ఆఫర్లిస్తోందని అంటున్నారు. మొత్తమ్మీద కేంద్రం ప్రకటించిన ఈ ఆఫర్ ప్రజలకు సంతోషాన్ని కలిగించకపోగా.. మరింత మంట పెట్టింది.