విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లెంపలేసుకున్న కేంద్రం..

కేంద్రంతో సంప్రదింపులు జరిపి, బకాయిలు చెల్లించేసిన ఆధారాలను చూపించాయి. దీంతో పై స్థాయిలో జరిగిన తప్పు బయటపడింది. తెలంగాణ రాష్ట్ర బకాయిలు రూ.7 కోట్లేనని సరిదిద్దుకుంది కేంద్రం.

Advertisement
Update:2022-08-21 08:18 IST

తెలంగాణ డిస్కంలు బకాయిలు ఉన్నాయంటూ విద్యుత్ కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపేలా.. నిషేధం విధించిన కేంద్రం చివరకు మెట్టు దిగింది. తన తప్పు తెలుసుకుని లెంపలేసుకుంది. మొదట డిస్కంల బకాయిలు 1380 కోట్ల రూపాయిలంటూ బుకాయించింది. ఆ తర్వాత ఓ మెట్టు దిగి 52 కోట్ల రూపాయలని చెప్పింది. కానీ తెలంగాణ డిస్కంలు ఒప్పుకోలేదు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి, బకాయిలు చెల్లించేసిన ఆధారాలను చూపించాయి. దీంతో పై స్థాయిలో జరిగిన తప్పు బయటపడింది. తెలంగాణ రాష్ట్ర బకాయిలు రూ.7 కోట్లేనని సరిదిద్దుకుంది కేంద్రం. ఈ బకాయిని రాష్ట్ర డిస్కంలు వెంటనే చెల్లించేయడంతో నిషేధాన్ని సడలించింది.

రాష్ట్రాల విద్యుత్‌ బకాయిలు, కొనుగోళ్లపై నిషేధం అంశంలో ఒత్తిడి తట్టుకోలేకే కేంద్రం వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. సాక్ష్యాధారాలతో సహా డిస్కంలు ముందడుగు వేసే సరికి కేంద్రం తలొంచక తప్పలేదు. గడువులోగానే చెల్లింపులు చేశామన్న తెలంగాణ వాదనను అంగీకరించింది. కేంద్రం నిషేధాన్ని సడలించిందని, ఎనర్జీ ఎక్స్ ఛేంజీల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లను పునఃప్రారంభించామని తెలంగాణ ట్రాన్స్‌ కో, జెన్‌ కోల సీఎండీ డి.ప్రభాకర్‌ రావు తెలిపారు.

మూడుసార్లు మాట మార్చారు..

గడువు ముగిసినా విద్యుదుత్పత్తి కంపెనీలకు బకాయిలు చెల్లించలేదంటూ.. తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కంలను కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఇందులో తెలంగాణ డిస్కంల విషయంలోనే మూడు సార్లు మాట మార్చింది కేంద్రం. బకాయిలు రూ.1,380 కోట్లనుంచి 52కోట్లకు ఆ తర్వాత 7కోట్లకు తగ్గించింది. వాస్తవానికి గడువులోగా బకాయిల చెల్లింపుల్లో డిస్కంలు విఫలమైతే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ)లోని నిబంధనల ప్రకారం.. విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు చర్యలు తీసుకోవచ్చనే నిబంధన ఉంది. కానీ కేంద్రం ఈ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటోంది. అక్కడ కూడా అనవసర రాద్ధాంతమే. లెక్కల తప్పులతో రెండురోజులపాటు తెలంగాణ డిస్కంలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది కేంద్రం. చివరకు బకాయిల విషయంలో వాస్తవాలు బయటపెట్టింది, విద్యుత్ కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News