బీసీలు రాజకీయంగా ఎదగడానికే కుటుంబ సర్వే
మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ
బీసీలు రాజకీయంగా ఎదగడానికే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. గీత కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య కిట్లు దోహద పడతాయన్నారు. కిట్లను ఉపయోగించడంపై గీత కార్మికులకు ట్రైనింగ్ ఇచ్చి కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలుసుకొని, వాటి ఆధారంగా ప్రజల బతుకులు బాగు చేసే కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. ఇందుకు కుటుంబ సర్వే దోహద పడుతుందన్నారు. గడిచిన పదేళ్లలో తాటిచెట్టు పై నుంచి పడి 750 మంది వరకు గీత కార్మికులు మరణించారని.. అలాంటి ప్రమాదాల నుంచి గీత కార్మికులను కాటమయ్య కిట్లు రక్షిస్తాయన్నారు. నీరా అమ్మకాలతో గీత కార్మికుల ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు కంరాంతి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.