దశాబ్ది గడిచిన సందర్భం ఇది.. కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్
బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిదన్నారు కేటీఆర్. అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రమిదని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రంగా అవతరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా భావోద్వేగంతో కూడిన ఓ ట్వీట్ చేశారు. దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకుని.. దశాబ్దం గడిచిన సందర్భమిదన్నారు. ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటంగా..తెలంగాణ ఉద్యమాన్ని అభివర్ణించారు కేటీఆర్.
బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన కేసీఆర్ పోరాట ఫలితమిదన్నారు కేటీఆర్. అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన కొత్త రాష్ట్రమిదని గుర్తుచేశారు. సబ్బండ వర్గాలు కొట్లాడి, పోట్లాడి మా రాష్ట్రం మాకంటూ సాధించుకున్నారన్నారు. 60 ఏళ్ల విధ్వంస గాయాలను పదేళ్ల వికాసంతో మాన్పేసుకున్న ఘనకీర్తి తెలంగాణదన్నారు కేటీఆర్.
పాలన చేతకాదని నొసటితో వెక్కిరించిన వాళ్లే.. మనసు నిండా ప్రశంసించిన దశాబ్దమిదన్నారు కేటీఆర్. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందనేలా దశాబ్దంలో తెలంగాణ దారి చూపిందన్న కేటీఆర్.. నాడు కరవు, రాళ్లు రప్పలు, కల్లోలిత తెలంగాణ ఇవాళ సుభిక్షమై కోటి రతనాల వీణగా మారిందన్నారు. అదే స్ఫూర్తి, అదే సంకల్పం ఇక ముందు ఉండాలని తెలంగాణ దేశానికి దిక్సూచిగా కొనసాగాలన్నారు.