కేటీఆర్ కోసం.. బీఆర్ఎస్ నేతల చలో దుబాయ్!
6వ తేదీన అమెరికా నుంచి తిరిగిరానున్న కేటీఆర్ మధ్యలో దుబాయిలో 12 గంటలపాటు ఆగుతారు. ఇక్కడికి వచ్చాక కేటీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమని భావిస్తున్న ఆశావహులు కొందరు నేరుగా దుబాయి వెళ్లి అక్కడే కలిసి విన్నపాలు ఇచ్చుకోవాలని భావిస్తున్నారు.
బీఆర్ఎస్ అసెంబ్లీ సీట్లు ప్రకటించి పది రోజులు దాటినా దాని ప్రభావం ఇంకా చల్లారలేదు. టికెట్ ఆశించి, భంగపడిన నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇంకా ఆశ తీరని మరికొంతమంది మాత్రం తమకు అవకాశం వస్తుందని గంపెడాశతో ఉన్నారు. మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విదేశీ పర్యటన నుంచి తిరిగొస్తే ఆయనతో గోడు చెప్పుకుని టికెట్ పొందే అవకాశాలున్నాయని మరికొందరు చాలా నమ్మకంగా ఉన్నారు. అలాంటి నేతలంతా ఇప్పుడు చలో దుబాయ్ అంటున్నారట!
కేటీఆర్ రాక ఆలస్యం
కుమారుడు హిమాన్షును అమెరికాలో గ్రాడ్యుయేషన్‌లో చేర్పించడానికి కేటీఆర్ గత నెల చివరలో అమెరికా వెళ్లారు. బీఆర్ఎస్ జాబితా ప్రకటించడానికి రెండు రోజుల ముందే ఆయన అమెరికా వెళ్లడంతో ఆయన మీదే ఆశలు పెట్టుకున్ననేతలకు గుండెల్లో రాయిపడింది. ఆయన ఈ నెల 2న (శనివారం_ తిరిగివస్తారని రాగానే బాధ చెప్పుకుందామని వెయిట్ చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కేటీఆర్ రాక 6వ తేదీకి వాయిదా పడింది.
కేటీఆర్ చెబితే టికెట్ వస్తుందనే ఆశ
కేటీఆర్‌కు సన్నిహితంగా మెలుగుతారని పేరున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈసారి ఉప్పల్ టికెట్ కోసం చాలా ఆశలే పెట్టుకున్నారు. కుత్బుల్లాపూర్ టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పఠాన్‌చెరు టికెట్ కావాలంటున్న నీలం మధు, జనగామ కోసం ప్రయత్నిస్తున్న మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వీరంతా కేటీఆర్‌తో చెప్పించుకుంటే పని అవుతుందనే ఆశించారు. ఆశిస్తున్నారు కూడా.
బ్రేక్ టైంలో దుబాయిలోనే కలవచ్చని ఆశ
6వ తేదీన అమెరికా నుంచి తిరిగిరానున్న కేటీఆర్ మధ్యలో దుబాయిలో 12 గంటలపాటు ఆగుతారు. ఇక్కడికి వచ్చాక కేటీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమని భావిస్తున్న ఆశావహులు కొందరు నేరుగా దుబాయి వెళ్లి అక్కడే కలిసి విన్నపాలు ఇచ్చుకోవాలని భావిస్తున్నారు. బొంతు రామ్మోహన్, నీలం మధులతో పాటు మరికొందరు చలో దుబాయ్.. మిలేంగే కేటీఆర్ అంటున్నారట!