కేసీఆర్‌ మీద పడి ఏడ్సుడే తప్ప చేసిందేం లేదు

RSS మూలాలున్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీని పెద్దన్న అనడంలో అతిశయోక్తి లేదన్నారు కవిత. కానీ తెలంగాణకు బ‌డ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోవడంపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

Advertisement
Update:2024-03-05 17:38 IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై పడి ఏడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల చావులు చూశామని, మళ్ళీ 3 నెలలుగా చూస్తూనే ఉన్నామ‌న్నారు. బోధన్ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థి మృతి తనను తీవ్రంగా బాధించిందన్నారు. మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు కవిత.

డిగ్రీ విద్యార్థిపై దాడిలో ఎనిమిది మంది ఇంటర్ విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైంది. విద్యార్థి మృతి ఘటన మర్డర్ కేసు నమోదు చేసి 8 మంది విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు కవిత. ఇప్పటికైనా గురుకుల పాఠశాలల్లో వాచ్‌మెన్ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్‌ని నియమించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టమన్నారు. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు నిరసన తెలిపితే అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు కవిత.

RSS మూలాలున్న రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీని పెద్దన్న అనడంలో అతిశయోక్తి లేదన్నారు కవిత. కానీ తెలంగాణకు బ‌డ్జెట్‌లో ఒక్క రూపాయి కేటాయించకపోవడంపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ మీద ఉన్న ధ్యాస ప్రజా సమస్యల మీద లేదని మండిపడ్డారు కవిత. కేసీఆర్‌ను మాట‌లు అన‌డానికి మాత్ర‌మే రేవంత్ సీఎం అయిన‌ట్టు ఉందన్నారు. పొలిటికల్ స్పీచ్‌లు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదన్నారు కవిత.

Tags:    
Advertisement

Similar News