పోటీ చేయలేను.. మన్నించండి - కేసీఆర్‌కు కడియం కావ్య లేఖ
ప్రస్తుత పరిస్థితులలో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో చెప్పారు కావ్య. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మన్నించాలని లేఖలో కోరారు.
బీఆర్ఎస్‌కు షాకిచ్చారు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు. తనకు పోటీ చేసేందుకు అవకాశం కల్పించినందుకు లేఖలో ధన్యవాదాలు తెలిపిన కావ్య.. పోటీ నుంచి తప్పుకోవడానికి పలు కారణాలను లేఖలో ప్రస్తావించారు.
లేఖలో కావ్య ఏమన్నారంటే.. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, లిక్కర్ స్కాం లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తోందని లేఖలో వివరించారు.
ప్రస్తుత పరిస్థితులలో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో చెప్పారు కావ్య. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మన్నించాలని లేఖలో కోరారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరడంతో మాజీ మంత్రి, ప్రస్తుతం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యను అభ్యర్థిగా ప్రకటించారు కేసీఆర్.
ఇక కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరతారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి విజయం సాధించారు.