కొన్ని గంటల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కూతురు ఆత్మహత్య

ఉదయం లేచేసరికి స్టోర్ రూమ్ తెరచి ఉండగా.. లోపలికి వెళ్లి చూడడంతో పెళ్లికూతురు రవళి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే రవళి తండ్రి ప్రభాకర్ పోలీసులకు సమాచారం అందించాడు.

Advertisement
Update:2022-12-11 12:14 IST

ఇంకొన్ని గంటలు గడిస్తే ఆ ఇంట్లో పెళ్లి. పెళ్లి కోసం ఇల్లు అంతా పూలతో అలంకరించారు. పెళ్లి పందిరి వేశారు. మరోవైపు పెళ్లికి వచ్చిన బంధువులతో ఇల్లు కళకళలాడుతోంది. అంతలోనే ఆ ఇంట్లో విషాదకర సంఘటన.. ఇంట్లోని స్టోర్ రూమ్ లో పెళ్లికూతురు ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇది చూసిన కుటుంబీకులు నిశ్చేస్టులయ్యారు. అప్పటివరకు సంతోషంతో గడిపిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన రవళి(26)కి నిజామాబాద్ కు చెందిన ఓ యువకుడితో ఇటీవల పెళ్లి నిశ్చయం అయింది. కాగా ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు నిజామాబాద్ లోని ఓ కళ్యాణ మండపంలో వారిద్దరికీ వివాహం కావాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. పెళ్లి కోసం రాత్రి పొద్దుపోయేదాకా పనులు చేసుకుంటూ గడిపిన పెళ్లికూతురు కుటుంబ సభ్యులు ఆ తర్వాత నిద్రించారు.

ఉదయం లేచేసరికి స్టోర్ రూమ్ తెరచి ఉండగా.. లోపలికి వెళ్లి చూడడంతో పెళ్లికూతురు రవళి ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే రవళి తండ్రి ప్రభాకర్ పోలీసులకు సమాచారం అందించాడు. శనివారం రాత్రి 10.30 గంటల వరకు పెళ్ళికొడుకు తన కూతురితో మాట్లాడుతూనే ఉన్నాడని.. అతడి వేధింపుల కారణంగానే రవళి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ యువకుడితో రవళి పెళ్లి నిశ్చయం అయినప్పటి నుంచి పెళ్లి తర్వాత ఉద్యోగం చేయాలని, అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. అంటూ పలు రకాల ఒత్తిళ్లకు గురిచేసినట్లు తెలుస్తోంది.

పెళ్లికి ముందు రోజు కూడా ఈ విషయాలే పెళ్ళికొడుకు మాట్లాడినట్లు సమాచారం. దీంతో రవళి మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ రాజారెడ్డి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. శనివారం రాత్రి రవళి, పెళ్ళికొడుకు మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం మొబైల్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన మెహందీ ఫంక్షన్ లో కూడా రవళి డ్యాన్స్ వేస్తూ సందడిగా కనిపించింది. ఇంతలోనే ఆమె విగతా జీవిగా మారడంతో పెళ్లింట రోద‌నలు మిన్నంటాయి.

Tags:    
Advertisement

Similar News