ఖమ్మంలో పాగా వేయడానికి కమలం పార్టీ సరికొత్త ఎత్తుగడ.!

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే హైదరాబాద్ చుట్టూ రాజకీయాలు నడిపితే సరిపోదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గానికి ఇప్పటికే అర్థం అయ్యింది.

Advertisement
Update:2022-09-06 19:04 IST

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే హైదరాబాద్ చుట్టూ రాజకీయాలు నడిపితే సరిపోదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గానికి ఇప్పటికే అర్థం అయ్యింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచినా.. అది పూర్తిగా పార్టీ ఖాతాలో వేయడానికి లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పుకోదగిన డివిజన్లలో గెలిచినా.. అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిపీట్ అవుతాయా అనే అనుమానం పార్టీలో నెలకొని ఉన్నది. అందుకే దక్షిణ తెలంగాణలో కూడా క్షేత్రస్థాయి వరకు కేడర్‌ను బలోపేతం చేస్తేనే.. అనుకున్న లక్ష్యం సాధించగలమని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మునుగోడులో ఉపఎన్నిక తీసుకొని రావడంలో సఫలం అయినా.. అక్కడ గెలుస్తామో లేదో అనే ఆందోళన పట్టుకున్నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రభావమే ఎక్కువ. అందుకే ఈ ఉపఎన్నిక విషయంలో దూకుడుగా పోవడం లేదు.

ఇక తెలంగాణలోని అన్ని జిల్లాలు ఒక ఎత్తైతే.. ఉమ్మడి ఖమ్మం జిల్లా మరో ఎత్తు. ఇక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రాబల్యమే ఎక్కువ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో జిల్లా మొత్తం కలిపి టీఆర్ఎస్ ఒకటే సీటు గెలిచింది. కాంగ్రెస్, టీడీపీ కలసి చెప్పుకోదగిన అసెంబ్లీ సెగ్మెంట్లను కైవసం చేసుకున్నది. ఇక 2018 ఎన్నికల్లో కూడా ఈ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ అతి కష్టంగా ఖమ్మం సీటును తమ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో వచ్చి చేరారు.

ఖమ్మం జిల్లా అంటేనే రాజకీయ చైతన్యం ఎక్కువ. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీనే చతికిల పడుతోంది. అలాంటిది మతతత్వ బీజేపీకి ఛాన్స్ ఉంటుందా అనేది అనుమానమే. ఖమ్మం, కొత్తగూడెం పట్టణాల్లో బీజేపీకి క్యాడర్ ఉన్నా.. ఆ పార్టీకి ఓట్లేసే వాళ్లు తక్కువే. అందుకే చరిష్మా కలిగిన నేతలను బీజేపీలోకి తీసుకొని రావాలని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులను పార్టీలోకి తీసుకొని వస్తే తప్పకుండా ఖమ్మంలో పాగా వేస్తామని బీజేపీ అంచనా వేస్తోంది. అందుకే సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది.

ఇటీవల పాలేరు నియోజకవర్గం పరిధిలోని తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురయ్యారు. తమ్మినేని వీరభద్రం కోసం ఈ కేసును అధికార పార్టీ నీరుగార్చే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. హత్యకు గురైన వ్యక్తి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు. ఈ హత్య దర్యాప్తు విషయంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని వాడుకొని తుమ్మలను పార్టీలోకి తీసుకొని రావాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 10న బండి సంజయ్ తెల్దారుపల్లి వెళ్లనున్నారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది.

పరామర్శ పేరుతో టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న తుమ్మలను తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి వచ్చేసారి టికెట్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచినా.. ఆ తర్వాత అధికార పార్టీలోకి ఉపేందర్ మారారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సిట్టింగులకే టికెట్లు ఇస్తానని కేసీఆర్ మాటిచ్చారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే.. తుమ్మలకు ఈ సారి మొండి చేయి తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

తుమ్మల నాగేశ్వరరావు కేవలం పాలేరులోనే కాకుండా సత్తుపల్లి, ఖమ్మం, కొత్తగూడెం నియోజకవర్గాల్లో కూడా ప్రభావం చూపగలరు. ఆయనతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా పార్టీలోకి తీసుకొని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరిద్దరూ బీజేపీలోకి వస్తే ఖమ్మంలో తప్పకుండా పాగా వేయగలుగుతామనే అంచనాకు వచ్చారు. సెప్టెంబర్ 10న బండి ఖమ్మం టూర్‌లో ఈ విషయాలపై కాస్త స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉన్నది. బీజేపీ శ్రేణులు కూడా రాబోయే ప్రజా సంగ్రామ యాత్ర ఆ జిల్లా లక్ష్యంగానే జరిగుతుందని చెబుతున్నాయి. ఏదేమైనా బలమైన నాయకులను పార్టీలోకి తీసుకొని రావాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా.. పెద్దగా సఫలం కావడం లేదు. మరి ఖమ్మం జిల్లా విషయంలో అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News