పురందేశ్వరికి షాకిచ్చేలా సొంత పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసే సాహసం పాలక పక్షం చేసిందంటే.. సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే చేస్తారని రఘునందన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో కుంభకోణంపై చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం చంద్రబాబు అరెస్టుపై బీజేపీ ఖండిస్తుందని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో అదే పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యే రఘునందన్ విభిన్నంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పురందేశ్వరికి షాకిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకీ ఎమ్మెల్యే రఘునందన్ ఏమన్నారంటే.. భారత్ ఓ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, గతంలో ఎంతోమంది అరెస్ట్ అయ్యారని చెప్పారు. అనేకమంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల కుటుంబ సభ్యులు అరెస్టులు అయ్యారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తనకింకా పూర్తిగా తెలియకపోయినా.. చంద్రబాబును అరెస్టు చేయడం మాత్రం ఏపీ ప్రభుత్వ సాహసంగానే చెప్పాలని ఆయన చెప్పారు.
మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసే సాహసం పాలక పక్షం చేసిందంటే.. సాక్ష్యాలు, ఆధారాలు ఉంటేనే చేస్తారని రఘునందన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అలాకాకుండా.. ఎన్నికల ముందు ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసి, వారికి సానుభూతి వచ్చేలా అరెస్ట్ చేస్తారని తాను భావించడం లేదని ఆయన తెలిపారు. దీంతో ఇవి పురందేశ్వరికి షాకిచ్చే వ్యాఖ్యలే అనే కామెంట్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.