ఈటల రాజేందర్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్.. మీడియాకు దూరంగా ఉండాలని సూచన?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ.. ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అన్నింటినీ సేకరించే పనిలో పడింది.

Advertisement
Update:2023-05-30 06:55 IST

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉందా? పొంగులేటి, జూపల్లిలను పార్టీలోకి తీసుకొని రావడంలో విఫలం అవడంతో పాటు.. మీడియా ముందు అనసవరమైన వ్యాఖ్యలు చేసినందుకు గుర్రుగా ఉందా? అంటే పార్టీ వర్గాలు అవుననే అంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరడం కష్టమేనని ఈటల రాజేందర్ సోమవారం వ్యాఖ్యానించారు. హోటల్ దసపల్లాలో నిర్వహించిన చిట్ చాట్‌లో వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరడానినే మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు.

వారిద్దరినీ పార్టీలోకి తీసుకొని రావడానికి ప్రయత్నించాను. కానీ వాళ్లే నాకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారంటూ మీడియా మందు వాపోయారు. ఇన్నాళ్లూ వారిని కాంగ్రెస్ పార్టీలో చేరకుండా మాత్రమే ఆపగలిగాను. కానీ బీజేపీలో చేరడానికి ఏ మాత్రం వాళ్లు సిద్ధంగా లేరని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు ఐడియాలజీ ఉన్న జిల్లా. అక్కడ బీజేపీకి ఏ మాత్రం చోటు లేదని నర్మగర్బంగా చెప్పుకొచ్చారు.

ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఇతర పార్టీల నేతలను తీసుకొని రావడంలో విఫలమవడమే కాకుండా.. అసలు ఒక జిల్లాలో బీజేపీకి స్థానమే లేదని చెప్పడంపై సీరియస్ అవుతున్నారు. ఈటల రాజేందర్ ప్రెస్ మీట్‌కు సంబంధించిన క్లిప్పింగ్స్ ఇప్పటికే పార్టీ అధిష్టానం వద్దకు చేరినట్లు తెలుస్తున్నది. గతంలో ఈటల చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై కూడా బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తున్నది.

బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రదించకుండానే పూర్తి వివరాలను అధిష్టానం సేకరించినట్లు సమాచారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ.. ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అన్నింటినీ సేకరించే పనిలో పడింది. రాష్ట్ర నాయకులు చేస్తున్న వ్యాఖ్యల కారణంగా పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని కూడా భావిస్తోంది. అసలు పార్టీకి చెప్పకుండా మీడియా చిట్ చాట్‌లు ఏర్పాటు చేయడంపై కూడా ఆగ్రహంగా ఉంది.

బీజేపీ రాష్ట్ర నేతలు లైన్ దాటి వ్యవహరిస్తున్నారని.. దీని వల్ల పార్టీకి నష్టం కలగడమే కాకుండా.. కార్యకర్తల్లో కూడా ఆందోళన నెలకొంటోందని భావిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని అంచనాకు వచ్చింది. ఇకపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని కూడా అంచనా వేస్తోంది. అందుకే ఇకపై మీడియా ముందు అనసవర వ్యాఖ్యలు చేయకుండా సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని భావిస్తోంది.

ఈటల రాజేందర్‌కు ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు వెళ్లినట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి ఇకపై బయట ఎక్కడా వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగానే చెప్పినట్లు తెలుస్తున్నది. ఇతర నేతలు కూడా పార్టీ లైన్ దాటి, డ్యామేజీ కలిగించేలా వ్యవహరిస్తే ఇకపై ఉపేక్షించబోమని కూడా హైకమాండ్ సంకేతాలు పంపింది. మరి ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉంటారా లేదా అనేది అనుమానమే. 

Tags:    
Advertisement

Similar News