`బండి` బాధితుల‌తో స‌భ పెడ‌తా.. ఎంత వ్య‌తిరేకత ఉందో చూపిస్తా.. - ధ‌ర్మ‌పురి బీజేపీ ఇన్‌చార్జ్ క‌న్నం అంజ‌య్య

పది రోజుల్లో బండి సంజయ్ బాధితులతో ఆత్మీయ సమ్మేళనం పెడతా, పార్టీ అధ్య‌క్షుడు బండి మీద ఎంత వ్యతిరేకత ఉందొ చూపిస్తా.. నీకు పదవులు రాకపోతే బీజేపీ రాష్ట్ర ఆఫీస్ తలుపులు పలగగొట్టినవ్‌.. నువ్వు చూపెట్టిన బాటలోనే నేను నిరసన వ్యక్తం చేస్తా`` అని క‌న్నం అంజ‌య్య ఫైర‌య్యారు.

Advertisement
Update:2023-03-14 12:20 IST

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ఆ పార్టీకి చెందిన ద‌ళిత‌ నాయ‌కుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బండి నాయ‌క‌త్వంలో ద‌ళితుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశామ‌ని, కుటుంబాన్ని వదులుకొని పార్టీ కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నా.. త‌మ‌ని కాద‌ని నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నాడ‌ని ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఇన్‌చార్జ్ క‌న్నం అంజ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బండి సంజయ్ తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశామ‌న్నారు.

బండి సంజయ్ కార్పొరేట్లకు, NRIలకు, పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్నారని, ప‌ద‌వులు కూడా వారికే క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆరోపించారు. సొంత డబ్బులు ఖర్చుపెట్టుకుని పార్టీకోసం పనిచేసేవారిని కాదని కార్పొరేట్ వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిప‌డ్డారు క‌న్నం అంజ‌య్య‌. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు పార్టీ అజెండాను ప‌క్క‌న‌బెట్టి త‌న వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నాడ‌న్నారు. దళిత నాయకులను కావాలని అణ‌గదొక్కుతున్నారని విమ‌ర్శించారు.

``పది రోజుల్లో బండి సంజయ్ బాధితులతో ఆత్మీయ సమ్మేళనం పెడతా, పార్టీ అధ్య‌క్షుడు బండి మీద ఎంత వ్యతిరేకత ఉందొ చూపిస్తా.. నీకు పదవులు రాకపోతే బీజేపీ రాష్ట్ర ఆఫీస్ తలుపులు పలగగొట్టినవ్‌.. నువ్వు చూపెట్టిన బాటలోనే నేను నిరసన వ్యక్తం చేస్తా`` అని క‌న్నం అంజ‌య్య ఫైర‌య్యారు.

బీజేపీలో ఎస్సీలు అంటే మాలలు మాత్రమే.. మాదిగలకు స్థానం లేదన్నారు. కాంగ్రెస్ నేత వెంకటస్వామి విగ్రహ ఆవిష్క‌ర‌ణకు వెళ్లిన బండి సంజ‌య్‌కి, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ జయంతి జ‌ర‌ప‌డానికి మ‌న‌సురాలేదా..? అని ప్ర‌శ్నించారు. ప్రశ్నించినందుకు త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేశాడ‌ని, ఆయ‌న‌ సస్పెండ్ చేసినా పార్టీ మారేది లేదని స్ప‌ష్టం చేశారు. ప‌ద‌విని, పార్టీని అడ్డం పెట్టుకొని బండి సంజయ్ కోట్లాది రూపాయలు సంపాదించాడ‌ని, ఒక రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పట్ల చేసిన వ్యాఖ్యలను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్సీ క‌విత‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను వెంట‌నే వెన‌క్కు తీసుకోవాల‌ని క‌న్నం అంజ‌య్య డిమాండ్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News