బండి సంజయ్‌పై హైకమాండ్ సీరియస్.. బస్సు యాత్రకు నో పర్మిషన్!

పాదయాత్రలో వస్తున్న జనాలను చూసి ఓట్లు పడతాయనే భ్రమలో ఉండొద్దని.. ముందుగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2022-12-28 08:40 IST

బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుకు హైకమాండ్ బ్రేక్ వేసినట్లు తెలుస్తున్నది. ఎంత సేపు యాత్రలు అంటూ తిరగడమే తప్ప.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విషయంలో సీరియస్‌గా ఉన్నది. సీనియర్ నేతలను కూడా పట్టించుకోకుండా వన్ మ్యాన్ షోలాగా పార్టీని నడిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజా సంగ్రామ యాత్రను ఇప్పటికే ఐదు విడతలు పూర్తి చేసిన బండి సంజయ్.. దాన్ని జూన్ వరకు కంటిన్యూ చేయాలని భావించినా బీజేపీ జాతీయ నాయకత్వం నో చెప్పింది. తాజాగా బస్సు యాత్ర చేయాలని రిక్వెస్ట్ పెట్టగా ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

బండి సంజయ్ ఉత్తర తెలంగాణలో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారు. అది ముగిసిన వెంటనే వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఆరో విడత యాత్ర చేయాలని భావించారు. కానీ హైకమాండ్ దానికి పచ్చ జెండా ఊపలేదు. పాదయాత్రలో వస్తున్న జనాలను చూసి ఓట్లు పడతాయనే భ్రమలో ఉండొద్దని.. ముందుగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించినట్లు తెలుస్తున్నది. పార్టీ పరంగా చేయాల్సిన పనులు చాలా ఉండగా.. వాటన్నింటినీ వదిలేసి యాత్రలు చేయడం సరి కాదని హైకమాండ్ చెప్పింది.

అసెంబ్లీల వారీగా సమావేశాలు నిర్వహించాలని.. అన్నీ ఆయా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనే నిర్వహించాలని అధిష్టానం ఆదేశించింది. రోజుకు మూడు సెగ్మెంట్ల సమీక్ష చేసి.. బూత్ కమిటీలను సంసిద్ధం చేయాలని చెప్పింది. పార్టీ పరంగా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి చేసి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలని తెలిపింది. జనవరి మొదటి వారం నుంచే మండలాల వారీగా బూత్ కమిటీల సమావేశాలను ప్రారంభించాలని.. క్షేత్ర స్థాయిలో పటిష్టంగా లేకపోతే ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదని తేల్చి చెప్పింది.

డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల కార్యకర్తల సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. అంతకు ముందే తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం కూడా నిర్వహిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సమావేశాల్లో వర్చువల్ (ఆన్‌లైన్)గా పాల్గొంటారని.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నికల వ్యూహాలను వివరిస్తారని తెలుస్తున్నది. ఇన్ని పనులు పెట్టుకొని యాత్రలు చేస్తానని కోరడం వల్లే హైకమాండ్ నిరాకరించినట్లు సమాచారం.

ఇక రాష్ట్రంలోని సీనియర్లకు బండి సంజయ్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈ విషయం జాతీయ నాయకత్వం వరకు వెళ్లింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని.. ప్రతీ పనికి తానే ముందుండాలనే తపనతో బండి సంజయ్ వారిని సైడ్ చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని.. హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అందుకే అధిష్టానం కూడా బండి సంజయ్ దూకుడుకు బ్రేక్ వేసినట్లు తెలుస్తున్నది. 

Tags:    
Advertisement

Similar News