వీహెచ్ వ్యాఖ్యలపై స్పందించిన భట్టి..
పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏఐసీసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనకు ఖమ్మం లోక్ సభ సీటు రాకుండా అడ్డుకుంటున్నారని, ఆయన తనకు ద్రోహం చేశారంటూ సీనియర్ నేత వి.హనుమంతరావు ఢిల్లీ వేదికగా రచ్చ చేసిన విషయం తెలిసిందే. బీసీల ఓట్లు కాంగ్రెస్ కు అక్కర్లేదా, బీసీలంటే అంత చులకనా అంటూ వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాంగ్రెస్ లో కలకలం రేపింది. ఆ వెంటనే భట్టి విక్రమార్క స్పందించారు. వీహెచ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏఐసీసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. ఖమ్మం టికెట్ వీహెచ్ కి రాకుండా తాను అడ్డుకున్నానేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. వీహెచ్ కే కాదు, తాను ఎవరికీ టికెట్ రాకుండా అడ్డుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం టికెట్ సీనియర్ నేత వీహెచ్‌కు ఇస్తే అందరం కలసి గెలిపించుకుంటామన్నారు. అయితే అది పూర్తిగా అధిష్టానం నిర్ణయం అని తేల్చి చెప్పారు భట్టి.
ఖమ్మంలో కాక..
ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం లోక్ సభ స్థానం హాట్ సీటుగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట కావడంతో ఈ సీటుకు భారీగా పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు, మరో మంత్రి తుమ్మల కొడుకు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఈ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమదే టికెట్ అని ధీమాగా చెబుతున్నారు. ఓ దశలో రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తారని అనుకున్నా.. అది ఊహాగానమేనని తేలిపోయింది. దీంతో ఇప్పుడు ఆశావహులంతా ఖమ్మంపై కర్చీఫ్ వేసుకుని కూర్చున్నారు. సీనియర్ ని అయిన తనకు టికెట్ రాకుండా పోతోందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.