తెలంగాణలో పోటీకి సిద్ధమంటున్న రాయలసీమ నేత పార్టీ
ఎంత హడావుడి చేసినా ఆంధ్రప్రదేశ్‌లో కాదు కదా రాయలసీమలోనే ఆయన గురించి పెద్ద పట్టించుకున్న వాళ్లు లేరు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణలో పోటీ చేస్తాననడం కాస్త విచిత్రమే.
రామచంద్రయాదవ్.. చిత్తూరు జిల్లా పుంగనూరు నాయకుడు. తన సొంత బలం కంటే అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో గొడవల వల్లే ఎక్కువ ఫేమస్ అయిన నేత. రెండు నెలల కిందట భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీని ప్రారంభించిన రామచంద్ర యాదవ్ ఇప్పుడు తెలంగాణలో పోటీకి సిద్ధమని పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలిచ్చారు. ఎక్కడో రాయలసీమ నేత.. అందునా పెద్దగా ఎవరికీ ముఖపరిచయం కూడా లేని కొత్త పార్టీతో ఆయన తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగుతాననడం సాహసమే.
పెద్దిరెడ్డితో గొడవ పడి.. ఏకంగా పార్టీ పెట్టేశారు
రామచంద్రయాదవ్ గత ఎన్నికల్లో పుంగనూరులో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో బాగానే సంపాదించిన ఆయన తన నియోజకవర్గంలో పోటీగా మారతారేమోనన్న ఆలోచనతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద కాస్త గట్టిగానే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరగడం, ఆ వెంటనే రామచంద్రయాదవ్ ఢిల్లీ వెళ్లి ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి పెద్దిరెడ్డిపై ఫిర్యాదు జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రామచంద్రయాదవ్ బీజేపీలో చేరతారేమో అనుకుంటుండగా ఆయన అనూహ్యంగా భారత చైతన్య యువజన పార్టీ అంటూ ఏకంగా కొత్త పార్టీ పెట్టేశారు. అంతేకాదు కమ్మ, కాపులు తప్ప వేరొకరు పోటీకి కూడా నిలబడని గోదావరి జిల్లాల్లోని అత్యధిక నియోజకవర్గాల్లో సైతం పెద్ద పెద్ద కటౌట్లు, అభిమాన సంఘాలు అంటూ హడావుడి చేసే ప్రయత్నం చేశారు.
తెలంగాణలో అంత అవకాశం ఉందా?
ఎంత హడావుడి చేసినా ఆంధ్రప్రదేశ్‌లో కాదు కదా రాయలసీమలోనే ఆయన గురించి పెద్ద పట్టించుకున్న వాళ్లు లేరు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏకంగా తెలంగాణలో పోటీ చేస్తాననడం కాస్త విచిత్రమే. అందునా ఆంధ్రప్రదేశ్‌లో ఢక్కా మొక్కీలు తింటున్న టీడీపీ, జనసేన లాంటి పార్టీలే తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదేమో అని వెనకా ముందూ ఆడుతుంటే అసలు ఇక్కడ ఉనికిలోనే లేని పార్టీ తరఫున పోటీ చేస్తామనడం సాహసమే. పైగా పదేళ్లలో తెలంగాణలో ఏం సాధించినం.. ఆకలి సావులు, నిరుద్యోగ ఛాయలు.. ఆత్మహత్యలు తప్ప అంటూ ప్రకటనలిచ్చి మరీ పోటీకి సై అనడం గమనార్హం.