ఆరోగ్య మహిళ.. మరింత చేరువగా
మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఈ క్లినిక్ లు మొదలయ్యాయి. ఇప్పుడు వీటి సంఖ్యను 372కి పెంచుతున్నారు. దశలవారీగా 1200 క్లినిక్ లు మహిళలకోసం అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం.
తెలంగాణలో 'ఆరోగ్య మహిళ క్లినిక్' లు ఊహించని స్థాయిలో విజయవంతమయ్యాయి. దీంతో వీటి సంఖ్య మరింత పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం 272 ఆరోగ్య మహిళ క్లినిక్ లు ఉండగా.. అదనంగా మరో 100 క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు మంత్రి హరీష్ రావు. ఈనెల 12న ఈ క్లినిక్ లను ప్రారంభిస్తారు. దీంతో వీటి సంఖ్య 372కి చేరుతుంది. 'ఆరోగ్య మహిళ' ద్వారా ఇప్పటివరకు 2,78,317 మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించి, అవసరమున్న 13673 మందికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించామని చెప్పారు మంత్రి.
'ఆరోగ్య మహిళ క్లినిక్' అంటే..?
ఇప్పటికే తెలంగాణలో మహిళల ఆరోగ్య సంరక్షణకు పలు పథకాలు, కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా 'ఆరోగ్య మహిళ క్లినిక్' లను అందుబాటులోకి తేవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది మహిళా దినోత్సవం రోజున వీటిని ప్రారంభించారు. అర్బన్ హెల్త్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకంగా ఈ క్లినిక్ లు అందుబాటులోకి వచ్చాయి. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు స్క్రీనింగ్ టెస్ట్ లు చేయడం, వైద్యం అందించడంకోసం ఈ క్లినిక్ లు పనిచేస్తాయి.
దశలవారీగా 1200 క్లినిక్ లు..
మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఈ క్లినిక్ లు మొదలయ్యాయి. ఇప్పుడు వీటి సంఖ్యను 372కి పెంచుతున్నారు. దశలవారీగా 1200 క్లినిక్ లు మహిళలకోసం అందుబాటులోకి తేవాలని చూస్తోంది ప్రభుత్వం. 8 ఆరోగ్య సమస్యలపై స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం, అవసరమైన వారికి అక్కడే చికిత్స అందించడం, మెరుగైన చికిత్స కోసం రెఫరల్ ఆస్పత్రులకు తరలించడం ఈ క్లినిక్ ల మఖ్య ఉద్దేశం. ఈ క్లినిక్ ల పనితీరుని ప్రత్యేక యాప్ ద్వారా వైద్య శాఖ మానిటరింగ్ చేస్తుంది.