వాట్సాప్ గ్రూప్ కబ్జా.. జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు..
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ హోదాలో ఉన్న లత, వసీంని గ్రూప్ నుంచి డిలీట్ చేసింది, అదేంటని ప్రశ్నించినందుకు చైతన్యని కూడా గ్రూప్ నుంచి డిలీట్ చేసింది. దీంతో వారిద్దరి ఇగో హర్ట్ అయింది, మేటర్ పోలీస్ స్టేషన్‌కి చేరింది.
భూమి కబ్జా, ఇల్లు కబ్జా, పొలం ఆక్రమణ.. ఇలాంటి కేసులే ఇప్పటి వరకూ చూశాం. తాజాగా వాట్సాప్ గ్రూప్ కబ్జా చేశారంటూ ఓ వింత ఫిర్యాదు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. చేసేదేం లేక ఆ ఫిర్యాదు తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ సహాయంతో కేసు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అసలేం జరిగింది..?
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాల్టీ పరిధిలో భవానీ నగర్ కాలనీ 25వ వార్డుకి చెందిన చైతన్య, వసీం అనే వ్యక్తులు ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ వార్డులోని ప్రముఖులందరి నెంబర్లు ఆ గ్రూప్‌లో యాడ్ చేశారు. వారిద్దరే ఆ గ్రూప్‌కి అడ్మిన్లుగా ఉండేవారు. ఈ క్రమంలో ఇటీవల వార్డు కౌన్సిలర్ లతని గ్రూప్‌లో చేర్చారు. తనకు కూడా అడ్మిన్ హోదా ఇవ్వాలని లత కోరడంతో అలాగే చేశారు. ఆ తర్వాత అడ్మిన్ హోదాలో ఉన్న లత, వసీంని గ్రూప్ నుంచి డిలీట్ చేసింది, అదేంటని ప్రశ్నించినందుకు చైతన్యని కూడా గ్రూప్ నుంచి డిలీట్ చేసింది. దీంతో వారిద్దరి ఇగో హర్ట్ అయింది, మేటర్ పోలీస్ స్టేషన్‌కి చేరింది.
తమను అడగకుండా గ్రూప్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నిస్తున్నారు చైతన్య, వసీం. అందులోనూ అది తాము క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ అని, కష్టపడి చాలా మందిని ఆ గ్రూప్‌లో జాయిన్ చేసుకున్నామని, కౌన్సిలర్ అనే గౌరవంతో లతని గ్రూప్ అడ్మిన్‌గా చేసినందుకు ఇలా తమ గ్రూప్ నుంచే తమను డిలీట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, తమ గ్రూప్ కబ్జాకి గురైందంటూ వారిద్దరూ జడ్చర్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. లతపై చర్యలు తీసుకోవాలని, తమని తిరిగి గ్రూప్‌లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వింత కేసుతో పోలీసులు తలలు పట్టుకున్నారు. కంప్లయింట్ ఇచ్చారు కాబట్టి, దానిపై విచారణ చేపడతామన్నారు జడ్చర్ల సీఐ రమేష్ బాబు. బహుశా వాట్సాప్ గ్రూప్ కబ్జాకి గురైందంటూ ప్రపంచంలో తొలిసారిగా కేసు నమోదైన ఘనత తెలంగాణకే దక్కుతుందేమో.