ఇష్టంలేని కటింగ్ చేయించారని 9ఏళ్ల బాలుడి ఆత్మహత్య

తండ్రి తనకు ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని 9ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

Advertisement
Update:2024-05-31 11:34 IST

తండ్రి తనకు ఇష్టం లేని హెయిర్ కటింగ్ చేయించాడని 9ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెంకు చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (9) హాస్టల్లో ఉంటున్నాడు.

ఈమధ్యే వేసవి సెలవులకు ఇంటికి వచ్చాడు. తండ్రి కాంతారావు హర్షవర్ధన్‌ను కటింగ్ షాప్‌కు తీసుకువెళ్లాడు. అయితే తనకు నచ్చినట్లు కటింగ్ చేయించట్లేదని షాపులోనే తండ్రితో గొడవపడ్డాడు హర్షవర్ధన్. చదువుకునే అబ్బాయివి నీకు ఈ కటింగే బాగుంటుంది బాబుకు తండ్రి సర్ధిచెప్పాడు.

నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని మనస్తాపానికి గురైన హర్షవర్ధన్ ఇంటికి వచ్చాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి వెనకాల పనిచేసుకుంటున్న తల్లిదండ్రులకు హర్షవర్ధన్ వాంతులు చేసుకుంటున్న శబ్దం వినిపించింది.

ఇంట్లోకి వెళ్లి చూడగా తమ కుమారుడు వాంతులు చేసుకోవడం చూసిన తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగారు. నాకు నచ్చని విధంగా కటింగ్ చేయించారని, అందుకే పురుగుల మందు తాగానని చెప్పాడు. దీంతో బాలుడ్ని వెంటనే నర్సంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీకి తరలించారు. గాంధీలో చికిత్సపొందుతూ హర్షవర్ధన్ గురువారం చనిపోయాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Tags:    
Advertisement

Similar News