వచ్చే ఎన్నికలకోసమే రూ.2వేల నోట్ల రద్దు

మోదీ ప్రభుత్వానికి బ్లాక్ మనీని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ. 2 వేల‌ నోట్లను వెంటనే రద్దు చేయాల్సి ఉండేదన్నారు. మార్చుకునే అవకాశం ఇచ్చారంటే.. అక్రమార్కులను వెనకేసుకొచ్చినట్టేకదా అని ప్రశ్నించారు సీపీఐ నారాయణ..

Advertisement
Update:2023-05-20 15:09 IST

వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సిన బ్లాక్ మనీని వైట్ చేసుకోడానికే ప్రధాని నరేంద్రమోదీ 2వేల రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తెరపైకి తెచ్చారని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దేశంలో అవినీతి లేదని చెబుతూ.. బీజేపీ ప్రభుత్వం మాత్రం హోల్‌ సేల్‌ గా అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. నిజంగానే మోదీ ప్రభుత్వానికి బ్లాక్ మనీని అంతం చేయాలనే చిత్తశుద్ధి ఉంటే రూ. 2 వేల‌ నోట్లను వెంటనే రద్దు చేయాల్సి ఉండేదన్నారు. మార్చుకునే అవకాశం ఇచ్చారంటే.. అక్రమార్కులను వెనకేసుకొచ్చినట్టేకదా అని ప్రశ్నించారు.

పెద్ద నోట్ల రద్దుతో ఏమొచ్చింది..?

రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు సమయంలో లక్షల కోట్ల నల్లధనం వైట్ మనీగా మారిందని విమర్శించారు నారాయణ. గతంలో పెద్ద నోట్ల ర‌ద్దు ప్రక్రియలో 3.4 లక్షల కోట్ల బ్లాక్ మనీ బయటపడుతుందని, ప్రతి భారతీయుడు అకౌంట్లో రూ. 15 లక్షలు జమ చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారాయన. ఎవరి అకౌంట్లో కూడా పైసా జమ కాలేదన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలో భాగంగానే రూ.2 వేల నోట్లను కేంద్రం రద్దుచేసిందని మండిపడ్డారు తెలంగాణ మంత్రి జగదీశ్‌ రెడ్డి. రూ.2 వేల నోట్ల రద్దు మోదీ ప్రభుత్వ తిరోగమన చర్య అని అన్నారాయన. గతంలో పెద్ద నోట్లు ఎందుకు రద్దుచేశారు..? నల్లధనం ఎంత వెలికితీశారనే విషయం ఇప్పటికీ దేశ ప్రజలకు తెలియదన్నారు. రూ.2 వేల నోట్ల రద్దుతో దేశంలో పేదరికం ప్రబలే అవకాశం ఉందన్నారు.

రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటో లేకపోతే గగ్గోలుపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. నోట్ల రద్దుపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు మంత్రి జగదీశ్ రెడ్డి. రిజర్వ్‌ బ్యాంకును ముందు పెట్టి ప్రజల కళ్లుగప్పుతున్నారని విమర్శించారు. ఉపయోగం లేని రూ.2 వేల నోటును అసలు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. 

Tags:    
Advertisement

Similar News