ఢిల్లీలో రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా అరెస్ట్
రెజ్లర్లు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ ఏం జరుగుతోందనేది కాసేపు అర్థం కాలేదు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు కొన్ని వారాలుగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించిన రెజ్లర్ సంఘ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని మహిళా రెజ్లర్లు గత కొన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి పూర్తి మద్దతు లభించింది. అయితే ఆదివారం రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా తదితరులు ఆదివారం కొత్త పార్లమెంటు వైపు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని పార్లమెంట్ వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెజ్లర్లు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అక్కడ ఏం జరుగుతోందనేది కాసేపు అర్థం కాలేదు. రెజ్లర్లు కొత్త పార్లమెంట్ భవనం వైపు వెళ్తుండటంతో సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని రెజర్లు మండి పడుతున్నారు. మేమేమైనా బారికేడ్లు విరగొట్టామా.. హద్దులు మీరామా అని ప్రశ్నించారు. తమకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తుంటే అరెస్టు చేయడంపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.