నేడే ఫైనల్..భారత్ కు ప్రపంచకప్ చిక్కేనా?

వన్డే ప్రపంచకప్ టైటిల్ మూడోసారి గెలుచుకోడానికి భారత్ ఉరకలేస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో ఐదుసార్లు విజేత ఆస్ట్ర్లేలియాతో రోహిత్ సేన తలపడనుంది.

Advertisement
Update:2023-11-19 08:45 IST

నేడే ఫైనల్..భారత్ కు ప్రపంచకప్ చిక్కేనా?

వన్డే ప్రపంచకప్ టైటిల్ మూడోసారి గెలుచుకోడానికి భారత్ ఉరకలేస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే సూపర్ సండే టైటిల్ ఫైట్ లో ఐదుసార్లు విజేత ఆస్ట్ర్లేలియాతో రోహిత్ సేన తలపడనుంది..

గత ఆరువారాలుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను ఓలలాడిస్తూ వచ్చిన 2023-ఐసీసీ వన్డే ప్రపంచకప్ క్లైయ్ మాక్స్ దశకు చేరింది. లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ దశలో 47 మ్యాచ్ లు ముగిసిన తరువాత ఫైనల్స్ కు రంగం సిద్ధమయ్యింది.

అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే టైటిల్ పోరులో ఆతిథ్య భారత్ మూడో ట్రోఫీకి గురిపెడితే...ఐదుసార్లు విజేత ఆస్ట్ర్రేలియా రికార్డుస్థాయిలో 6వ ప్రపంచ టైటిల్ వేటకు దిగింది.

హాట్ ఫేవరెట్ గా భారత్...

రోహిత్ శర్మ కెప్టెన్ గా, రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ దశ నుంచి సెమీస్ వరకూ భారత్ వరుసగా 10 విజయాలు సాధించడం ద్వారా టైటిల్ సమరానికి సిద్ధమయ్యింది.

టోర్నీలో ప్రత్యర్థులుగా ఉన్న మొత్తం 9 జట్లను చిత్తు చేసిన ఒకే ఒక్కజట్టుగా తిరుగులేని రికార్డుతో నిలిచిన భారత్ కు లీగ్ దశ ప్రారంభమ్యాచ్ లోనే ఆస్ట్ర్రేలియాను కంగుతినిపించిన ఆత్మవిశ్వాసం ఫైనల్ పోరులో అదనపు బలంకానుంది.

ప్రస్తుత టోర్నీలో భారత్ ఇప్పటి వరకూ ఆడిన 10కి 10 మ్యాచ్ ల్లోనూ విజేతగా నిలిస్తే..ఆస్ట్ర్రేలియా 8 వరుస విజయాలు, 2 పరాజయాల రికార్డుతో 8వసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

హోరాహోరీనా...ఏకపక్షమా?

ప్రస్తుత ప్రపంచకప్ లోని రెండు అత్యుత్తమజట్ల నడుమ జరిగే ఈ టైటిల్ పోరు హోరాహోరీగా సాగుతుందా? లేక ఏకపక్షంగా ముగుస్తుందా? అన్నప్రశ్నలు అభిమానులను మాత్రమే కాదు..విశ్లేషకులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో మాత్రమే కాదు..చేజింగ్ లేదా సెట్టింగ్ ల్లో అత్యంత నిలకడగా రాణించినజట్టుగా భారత్ నిలిస్తే...ఆస్ట్ర్రేలియా మాత్రం గత 8 మ్యాచ్ ల్లో కుదురుకోడం ద్వారా గాడిలో పడినట్లే కనిపిస్తోంది.

రెండుజట్లూ స్థాయికి తగ్గట్టుగా ఆడితే పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. భారత బ్యాటింగ్ కు..కంగారూ పేస్ బౌలింగ్ ఎటాక్ కు నడుమ ఆసక్తికరమైన పోరు జరుగనుంది.

అహ్మదాబాద్ స్టేడియం పిచ్ పైన ముందుగా బ్యాటింగ్ కు దిగిన జట్ల సగటు స్కోరు 250గా ఉంది. గత నాలుగుమ్యాచ్ ల్లో మూడుసార్లు చేజింగ్ కు దిగిన జట్లే విజేతలుగా నిలవడంతో మరోసారి టాస్ కీలకం కానుంది.

తుదిజట్టులో అశ్విన్ కు చోటు తప్పదా?

భారతజట్టు ఆడిన గత ఆరుమ్యాచ్ ల్లోనూ విన్నింగ్ కాంబినేషన్ నే కొనసాగించింది. అయితే..ఈరోజు జరిగే ఫైనల్లో మాత్రం తుదిజట్టులో కనీసం ఒక్కమార్పు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లు అనుకూలించే అవకాశం ఉండడంతో భారత్ అదనపు స్పిన్నర్ గా తుదిజట్టులో జాదూ స్పిన్నర్ అశ్విన్ కు చోటు కల్పించే అవకాశం లేకపోలేదు. ఎక్స్ ట్రా బ్యాటర్ సూర్యకుమార్ లేదా సీమర్ సిరాజ్ ల్లో ఒకరిని తప్పించగిలిగితేనే అశ్విన్ ను తుదిజట్టులో చేర్చుకొనే వీలుటుంది. పైగా కంగారూ ఓపెనింగ్ జోడీ ఇద్దరూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కావడంతో అశ్విన్ ఉండితీరాల్సిందేనని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుత ప్రపంచకప్ ప్రారంభమ్యాచ్ లో ఆస్ట్ర్రేలియాపైనే తన తొలి, ఏకైక మ్యాచ్ ఆడిన అశ్విన్ ఆ తర్వాత నుంచి బెంచ్ కే పరిమితమవుతూ వచ్చాడు. అశ్విన్ కు చోటు దక్కితే ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం భారత్ కు ఉంటుంది.

ఆస్ట్ర్రేలియా మాత్రం సెమీస్ లో నెగ్గినజట్టునే టైటిల్ సమరంలో సైతం కొనసాగించే అవకాశం లేకపోలేదు.

కంగారూలతో డేంజర్, యమడేంజర్..!

ఆస్ట్ర్రేలియాకు అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థిగా పేరు, రికార్డులు ఉన్నాయి. పైగా ..గత మూడేళ్లుగా జరిగిన ఐసీసీ టోర్నీలలో నిలకడగా రాణించిన ఘనత సైతం ఉంది.

వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే 8సార్లు ఫైనల్స్ చేరిన, ఇప్పటికే 5 టైటిల్స్ నెగ్గిన ఏకైకజట్టు ఆస్ట్ర్రేలియా మాత్రమే. ప్రపంచకప్ ఫైనల్స్ లో ఆడిన అపారఅనుభవానికి తోడు పోరాడే తత్వం కంగారూజట్టుకు అదనపు బలంగా ఉంది.

ఓపెనింగ్ జోడీ ట్రావిడ్ హెడ్- వార్నర్, వన్ డౌన్ మిషెల్ మార్ష్, మిడిలార్డర్ బ్యాటర్లు స్మిత్, లబుషేన్, ఇంగ్లిష్, మాడ్ మాక్స్ హిట్టర్ గ్లెన్ మాక్స్ వెల్ లలో ఏ ఇద్దరు నిలదొక్కుకొన్నా భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.

ఇక..బౌలింగ్ లో స్టార్క్, హేజిల్ వుడ్, కమిన్స్ లతో పాటు..స్పిన్ త్రయం జంపా, మాక్స్ వెల్, హెడ్ లతో..భారత టాపార్డర్ కు కంగారూజట్టు సవాలు విసురుతోంది.

భారత్ కు హిట్ మ్యానే కీలకం...

భారత కెప్టెన్ కమ్ డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇచ్చే ఆరంభంపైనే భారత్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. లీగ్ దశ మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియాపై విఫలమైన రోహిత్..ప్రస్తుత ఫైనల్లో భారీస్కోరు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే 21 సిక్సర్లతో 550 పరుగులు సాధించిన రోహిత్..మొదటి 10 ఓవర్లలో చెలరేగిపోతే...

కంగారూజట్టుకు కష్టాలు తప్పవు.

యువఓపెనర్ శుభ్ మన్ గిల్, వన్ డౌన్ విరాట్ కొహ్లీ, రెండోడౌన్ శ్రేయస్ అయ్యర్, మూడో డౌన్ రాహుల్ సైతం సూపర్ ఫామ్ లో ఉండడంతో భారత బ్యాటింగ్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.

బౌలర్లలో మహ్మద్ షమీ మినహా మిగిలిన బౌలర్లంతా కుదురుగా రాణిస్తూ వస్తున్నారు. గత మ్యాచ్ లో 7 వికెట్లు పడగొట్టిన సీమర్ మహ్మద్ షమీ తో పాటు యార్కర్ల కింగ్ బుమ్రా సైతం కీలకపాత్ర పోషించనున్నాడు.

ప్రధానితో సహా లక్షమంది...

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ఎదురుచూస్తున్న ఈ ప్రపంచకప్ ఫైనల్స్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. లక్షా 30 వేల మంది అభిమానులతో స్టేడియం కిటకిటలాడి పోనుంది.

మ్యాచ్ నడుమ పలు కార్యక్రమాలు నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. ప్రత్యక్షప్రసారాలు, డిజిల్ వేదికల ద్వారా ..ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల నుంచ 10 కోట్ల మంది వరకూ ఈమ్యాచ్ ను చూసే అవకాశం ఉంది.

ఆస్ట్ర్రేలియా 8- భారత్ 5...

వన్డే ప్రపంచకప్ 48 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకూ ఆస్ట్ర్రేలియా, భారతజట్లు 13 సార్లు తలపడితే..ఆస్ట్ర్రేలియా 8 విజయాలు, భారత్ 5 విజయాల రికార్డుతో ఉన్నాయి.

ఓవరాల్ గా రెండుజట్లు ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే ఆస్ట్ర్రేలియా 83- భారత్ 57 విజయాలు సాధించాయి. ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ వరకూ ఈ రెండుజట్లూ

150 వన్డేలలో తలపడితే ఆస్ట్ర్రేలియాకు 83 విజయాలు, భారత్ కు 57 విజయాలు ఉన్నాయి. గత మూడుసంవత్సరాల కాలంలో మాత్రం ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా భారత్ కే ఎక్కువ విజయాలున్నాయి.

ప్రస్తుత ప్రపంచకప్ లో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లు ఒక ఎత్తు..ఈరోజు జరిగే టైటిల్ సమరం మరో ఎత్తు. భారత్ మూడోసారి ప్రపంచకప్ అందుకొంటుందా? లేక ఆస్ట్ర్రేలియా 6వసారి విజేతగా నిలుస్తుందా? తెలుసుకోవాలంటే...కొద్దిగంటలపాటు టీవీలకు అంటుకుపోయి..ఉత్కంఠను భరిస్తూ మ్యాచ్ ను చూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News