భారత క్రికెట్లో ఒకే ఒక్కడు, వందో టీ-20 ఆడుతున్న విరాట్!
భారత మాజీ కెప్టెన్, సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును జమ చేసుకోబోతున్నాడు. పాక్‌తో ఈ రోజు జరిగే మ్యాచ్ ద్వారా 100వ అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లు ఆడిన భారత తొలి క్రికెటర్ కానున్నాడు.
భారత నవతరం క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. ఇప్పటికే సాంప్రదాయ టెస్టులు, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలో వందేసి మ్యాచ్‌లు చొప్పున ఆడిన కోహ్లీ... టీ-20 ఫార్మాట్లో సైతం వంద మ్యాచ్‌ల రికార్డును పూర్తి చేయనున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ గ్రూప్ - ఏ లీగ్‌లో భాగంగా ఈ రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ ద్వారా 33 ఏళ్ల విరాట్ 100 టీ-20 అంతర్జాతీయ మ్యాచ్‌ల మైలురాయిని చేరనున్నాడు.
కోహ్లీకి కోహ్లీ మాత్రమే సాటి...
గత పుష్కర కాలంగా క్రికెట్ మూడు(టెస్ట్, వన్డే, టీ-20 ) ఫార్మాట్లలోనూ ఒకే తీరుగా రాణిస్తూ వచ్చిన విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇప్పటికే వందేసి టెస్టులు, వన్డేలకు పైగా ఆడి 70 అంతర్జాతీయ శతకాలు సాధించిన విరాట్ కోహ్లీ..గత రెండేళ్లుగా వెనుకబడిపోయాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. గత వెయ్యి రోజులుగా అంతర్జాతీయ క్రికెట్‌లో శతకమన్నదే లేకుండా నీరుగారిపోయాడు. అయితే..గత కొద్దివారాలుగా క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకొన్న విరాట్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో తిరిగిబరిలో నిలిచాడు.
గత 14 సంవత్సరాలుగా...
ఒకటి కాదు...రెండు కాదు...గత 14 సంవత్సరాలుగా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ సాధించని రికార్డులు, అందుకోని ఘనతలు అంటూ ఏవీలేవు. క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ సుదీర్ఘ కాలం రాణిండం అంటే మాటలు కాదు. 2008లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ జీవితం ప్రారంభమయ్యింది. టీ-20 ఫార్మాట్లో బారత్ తరపున ఇప్పటికే 99 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ ఇప్పటి వరకు 3 వేల 308 పరుగులు సాధించాడు. 50.12 సగటుతో 94 పరుగుల అత్యధిక స్కోరు నమోదు చేశాడు. కోహ్లీ మొత్తం 30 అర్థ శతకాలు బాదాడు.
50 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా కోహ్లీ...
టీ-20 ఫార్మాట్‌లో 2017 నుంచి 2021 వరకు మొత్తం 50 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కోహ్లీ నాయకత్వం వహించాడు. అందులో 30 విజయాలు, 16 పరాజయాల రికార్డు ఉంది. రెండు మ్యాచ్‌లు టైగా ముగిస్తే... మరో రెండు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. కెప్టెన్‌గా విన్నింగ్ పర్సంటేజ్ 64.58 శాతంగా ఉంది. చివరి సారి పాక్‌తో ఆడిన టీ-20 పోరులో భారత్ పరాజయం పాలైనా... ఆ మ్యాచ్‌లో కోహ్లీ 57 పరుగులు సాధించాడు.
పాక్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన తొమ్మిది టీ-20 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ మొత్తం 331 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా నిలిచాడు. విరాట్ 78 పరుగులు అత్యధిక స్కోరుతో మొత్తం 7 ఇన్నింగ్స్ లో 311 పరుగులు సాధించాడు. 3 అర్థ శతకాలతో 118.25స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే తన వందో మ్యాచ్ ద్వారా విరాట్ పూర్తిస్థాయిలో రాణించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తన జైత్రయాత్రను తిరిగి కొనసాగించాలని కోరుకొందాం. ఈ మ్యాచ్ లో గణనీయమైన స్కోరు సాధించగలిగితే విరాట్ కోహ్లీ పునరాగమనం చిరస్మరణీయంగా మిగిలిపోనుంది.