ఒకే వేదికలో 100 ఐపీఎల్ మ్యాచ్ లు..విరాట్ అరుదైన రికార్డు!

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా విరాట్ కొహ్లీ మరో అరుదైన సెంచరీ సాధించాడు. ఒకే వేదికగా 100 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

Advertisement
Update:2024-04-03 13:11 IST

క్రికెట్ ఫీల్డ్ లో పరుగులు, సెంచరీలతో రికార్డుల మోత మోగించే భారత క్రికెట్ రన్ మెషీన్ విరాట్ కొహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్-17వ సీజన్ మూడోరౌండ్ మ్యాచ్ ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు...

విరాట్ కొహ్లీ..క్రికెట్ మూడు ఫార్మాట్లలోనూ డజనుకు పైగా ప్రపంచ రికార్డులు నెలకొల్పిన మొనగాడు.చివరకు ఐపీఎల్ లో సైతం విరాట్ కొహ్లీ తరువాతే ఎవరైనా. గత 17 సీజన్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకే ఆడుతూ వస్తున్న విరాట్ ప్రస్తుత 2024 సీజన్ ద్వారా మరో విలక్షణమైన రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు.

బెంగళూరులో విరాట్ మ్యాచ్ ల సెంచరీ...

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో పాల్గొనడం ద్వారా విరాట్ కొహ్లీ మరో అరుదైన సెంచరీ సాధించాడు. ఒకే వేదికగా 100 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.

2008 ప్రారంభ ఐపీఎల్ నుంచి 2024 ఐపీఎల్ వరకూ గత 17 సీజన్లుగా బెంగళూరు ఫ్రాంచైజీనే విరాట్ అంటిపెట్టుకొని వస్తున్నాడు. ఈ క్రమంలో తన హోంగ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా 100వ ఐపీఎల్ మ్యాచ్ ను ఆడగలిగాడు.

ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వాంఖడే స్టేడియం వేదికగా 80 మ్యాచ్ లు ఆడటం ద్వారా విరాట్ స్థానంలో నిలిచాడు. మహేంద్రసింగ్ ధోనీ చెపాక్ స్టేడియం వేదికగా 69 మ్యాచ్ లు ఆడటం ద్వారా మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

హోంగ్రౌండ్లో వందో మ్యాచ్ ఆడిన విరాట్ కు చేదుఅనుభవమే మిగిలింది. లక్నోజట్టు చేతిలో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. విరాట్ సైతం 16 బంతుల్లో 2 ఫోర్లు, సింగిల్ సిక్సర్ తో 22 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

ముంబైజట్టు 250 మ్యాచ్ ల రికార్డు.....

మరోపక్క..వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టు సైతం ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. ఐపీఎల్ చరిత్రలో 250 మ్యాచ్ లు ఆడిన తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది.

హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన మూడోరౌండ్ మ్యాచ్ ద్వారా 250 మ్యాచ్ ల మైలురాయిని చేరుకోగలిగింది. గత 17 సీజన్లుగా లీగ్ లో పాల్గొంటూ వస్తున్న మొత్తం 5 ఫ్రాంచైజీలలో బెంగళూరు, మొహాలీ, కోల్ కతా, ఢిల్లీ కంటే ముంబై జట్టే ముందుగా 250వ మ్యాచ్ ను ఆడిన జట్టుగా నిలిచింది.

రాయల్ చాలెంజర్‌ బెంగళూరు 244 మ్యాచ్ లతో రెండు, ఢిల్లీ క్యాపిటల్స్ 241 మ్యాచ్ లతో మూడు, కోల్ కతా నైట్ రైడర్స్ 239 మ్యాచ్ లతో నాలుగు, పంజాబ్ కింగ్స్ 235 మ్యాచ్ లతో ఐదు స్థానాలలో కొనసాగుతున్నాయి.

రెండుసీజన్లపాటు ఐపీఎల్ కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 228 మ్యాచ్ లతో ఆరవ స్థానంలో నిలిచింది.

250 మ్యాచ్ ల రికార్డు పూర్తి చేసిన ముంబై జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో విజేతగా నిలిచిన రికార్డు ఉంది.

ఐపీఎల్ చరిత్రలో ముందుగా ఐదు టైటిల్స్ నెగ్గడంతో పాటు..అత్యధికంగా 250 మ్యాచ్ లు ఆడిన తొలిజట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లో చోటు సంపాదించింది.

Tags:    
Advertisement

Similar News