పారిస్ ఒలింపిక్స్ కు వినేశ్, అన్షు అర్హత!

భారత వివాదాస్పద వస్తాదు వినేశ్ పోగట్ ప్రతికూల పరిస్థితులను జయించి మరీ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా మరోసారి సత్తా చాటుకొంది.

Advertisement
Update:2024-04-21 17:30 IST

భారత వివాదాస్పద వస్తాదు వినేశ్ పోగట్ ప్రతికూల పరిస్థితులను జయించి మరీ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సంపాదించింది. స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా మరోసారి సత్తా చాటుకొంది...

భారత కుస్తీ సమాఖ్య పెద్దల అనుచిత వైఖరికి నిరసనగా రోడ్డెక్కడంతో పాటు..న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించిన వివాదాస్పద రెజ్లర్ వినేశ్ పోగట్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ను ఖాయం చేసుకోడం ద్వారా విమర్శుకుల నోటికి తాళం వేసింది.

ప్రతికూల పరిస్థితిని అధిగమించి..

ఏడుగురు మహిళా వస్తాదుల పై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత కుస్తీ సమాఖ్య పెద్దలపై వినేశ్ పోగట్ తో సహా మొత్తం 30 మంది రెజ్లర్లు తిరుగుబాటు చేసి కొద్దిమాసాల పాటు కలకలం రేపారు. చివరకు న్యాయం కోసం ఢిల్లీ కోర్టులను సైతం ఆశ్రయించారు. కుస్తీ సమాఖ్య పై తమ పోరాటంతో కొద్దిమాసాలపాటు ఆటకు దూరమైన వినేశ్ ఒకదశలో పారిస్ ఒలింపిక్స్ కు సైతం దూరం కాకతప్పదని అందరూ భావించారు.

అయితే..శారీరక, మానసిక పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా, కుస్తీ సమాఖ్య పెద్దలు నూటికి నూరుశాతం అండగా నిలువలేకపోయినా..వినేశ్ మాత్రం ఒంటరిపోరాటమే చేసింది. కజకిస్థాన్ రాజధాని బిష్ కెక్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ అర్హత ఆసియా కుస్తీ పోటీల మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్స్ చేరుకోడం ద్వారా పారిస్ టికెట్ ఖాయం చేసుకోగలిగింది.

తొలిరౌండ్ నుంచి సెమీస్ వరకూ...

కామన్వెల్త్ గేమ్స్, ఆసియాక్రీడల కుస్తీ పోటీలలో భారత్ కు గతంలోనే బంగారు పతకాలు సాధించి పెట్టిన వినేశ్ పోగట్ ఒలింపిక్స్ లోనూ భారత్ కు స్వర్ణపతకం సాధించి పెట్టాలన్న పట్టుదలతో ఉంది.

ఒలింపిక్స్ అర్హత కుస్తీ పోటీల తొలిరౌండ్లో కొరియా వస్తాదు మిరాన్ చియోన్ ను టెక్నికల్ నాకౌట్ ద్వారా అధిగమించింది. ఆ తర్వాత నామమాత్రంగా సాగిన రెండోరౌండ్ పోరులో కాంబోడియా మల్లయోధురాలు స్మనాంగ్ డిట్ ను కేవలం నిముషంలోనే చిత్తు చేయడం ద్వారా సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

కజకిస్థాన్ కు చెందిన లారా గనిక్యాజాను ఓడించడం ద్వారా ఫైనల్స్ కు అర్హత సాధించింది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం మొత్తం 20 విభాగాల ఫైనల్స్ చేరిన రెజ్లర్లకు మాత్రమే నేరుగా ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది.

వరుసగా మూడో ఒలింపిక్స్ లో...

ఒలింపిక్స్ కు అర్హత సాధించడం వినేశ్ పోగట్ కు ఇదే మొదటిసారికాదు. గతంలో రియో గేమ్స్, టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొన్న వినేశ్ పారిస్ ఒలింపిక్స్ కు సైతం అర్హత సాధించడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేసింది. వరుసగా మూడు ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత తొలి మహిళా వస్తాదుగా రికార్డుల్లో చేరనుంది.

మహిళల 57 కిలోల విభాగంలో అన్షు మాలిక్ సైతం పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకోగలిగింది.

ప్రపంచ అండర్ -23 చాంపియన్ రీతికా సైతం ఒలింపిక్స్ కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళల 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ సాధించిన సంగతి తెలిసిందే.

మహిళల 57 కిలోల విభాగం సెమీఫైనల్లో ఉజ్బెకిస్థాన్ వస్తాదు లాలీకోన్ సోబరోవ్ ను అధిగమించడం ద్వారా ఫైనల్స్ చేరుకోడంతోనే ఒలింపిక్స్ అర్హత దక్కింది. టోక్యో ఒలింపిక్స్ లో గతంలో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన అన్షుకు ఇప్పుడు పారిస్ టికెట్ సైతం దక్కింది.

మహిళల 50 కిలోల ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ వస్తాదు అకెటెంజీతో వినేశ్ పోగట్ తలపడనుంది.

మహిళల 62 కిలోల విభాగంల మానసి, 76 కిలోల విభాగంలో రీతిక సైతం తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

Tags:    
Advertisement

Similar News