హర్మన్ నాయకత్వంలో భారత్ ప్రపంచకప్ పోరు!
2023 మహిళా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది
2023 మహిళా టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. దక్షిణాఫ్రికా వేదికగా ఫిబ్రవరి 10న ప్రపంచకప్ ప్రారంభంకానుంది...
మహిళా టీ-20 ( 2023 ) ప్రపంచకప్ కు దక్షిణాఫ్రికాలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఫిబ్రవరి 10 నుంచి 29 వరకూ జరిగే ఈటోర్నీలో ప్రపంచ మేటిజట్లన్నీ తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి.
పాకిస్థాన్ తో భారత్ తొలిపోరు...
ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తోంది. ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టు వివరాలను బీసీసీఐ మహిళా ఎంపిక సంఘం ప్రకటించింది.
ఓపెనర్ స్మృతి మంథానా భారతజట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఫిబ్రవరి 12 న భారత్ తన ప్రారంభమ్యాచ్ ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఆడనుంది. ఈ పోటీకి కేప్ టౌన్ ఆతిథ్యమివ్వనుంది
గ్రూప్-2లో భారత్...
ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, ఐర్లాండ్ జట్లతో కూడిన గ్రూప్-2 లీగ్ లో భారత్ పోటీకి దిగుతోంది. గ్రూపులీగ్ మొదటి రెండుస్థానాలలో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ నాకౌట్ రౌండ్లో తలపడనున్నాయి.
ఫిబ్రవరి 26న టైటిల్ సమరం నిర్వహిస్తారు.
మొత్తం 15 మంది సభ్యుల భారతజట్టులో వెటరన్ పేసర్ శిఖా పాండే తిరిగి చోటు సంపాదించింది. 2021 సీజన్లో భారత్ తరపున తన చివరిమ్యాచ్ ఆడిన శిఖా పాండేకి 3 టెస్టులు, 55 వన్డేలు, 56 టీ-20 మ్యాచ్ లు ఆడిన రికార్డు ఉంది. 33 సంవత్సరాల శిఖా పాండే చేరికతో భారత పేస్ బౌలింగ్ మరింత పటిష్టంకానుంది.
ఆస్ట్ర్రేలియాతో సిరీస్ లో దారుణంగా విఫలమైనా జెమీమా రోడ్రిగేజ్ ప్రపంచకప్ జట్టులో చోటు నిలుపుకోగలిగింది.
లెఫ్టామ్ పేస్ బౌలర్ అంజలి శ్రావణి, రేణుక ఠాకూర్, పూజా వస్త్రకర్ పేస్ బౌలర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
స్పిన్ బౌలర్లుగా దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్ వ్యవహరిస్తారు. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ -19 ప్రపంచకప్ లో పాల్గొంటున్న
భారతజట్టులోని షఫాలీ వర్మ, రిచా ఘోష్ ఆ తర్వాత సీనియర్ జట్టులో చేరనున్నారు.
సన్నాహకంగా ముక్కోణపు సిరీస్..
ప్రపంచకప్ కు సన్నాహకంగా జనవరి 19నుంచి జరిగే ముక్కోణపు సిరీస్ లో భారత్ తలపడనుంది.
ఇదీ భారతజట్టు..
హర్మన్ ప్రీక్ కౌర్ ( కెప్టెన్ ), స్మృతి మంధానా ( వైస్ కెప్టెన్ ), షఫాలీ వర్మ, యాస్టికా భట్ ( వికెట్ కీపర్ ), రిచా ఘోష్ ( వికెట్ కీపర్ ), జెమీమా రోడ్రిగేజ్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, దేవికా వైద్య, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్, అంజలి శ్రావణి, పూజా వస్త్ర్రకర్, రాజేశ్వరీ గయక్వాడ్, శిఖా పాండే.
సబ్బినేని మేఘన, స్నేహ రాణా, మేఘనా సింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.