ఫైనల్‌లో తుదిజట్టులో భారత్ ఒక్క మార్పు చేయనుందా?
25 ఏళ్ల తర్వాత కివీస్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తలపడుతున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపిక అత్యంత కీలకం.;
దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ ఛాంపియన్స్ ఫైనల్ ఆడటానికి భారత్ సిద్ధమైంది. మరి తుది జట్టు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మరోసారి నలుగురు స్పిన్నర్లతో ఆడితే మంచిదని విశ్లేషించారు. 25 ఏళ్ల తర్వాత కివీస్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తలపడుతున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపిక అత్యంత కీలకం. ఈ క్రమంలో రోహిత్ సేన ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కీలకమైన ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీ మోకాలికి గాయమైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతను ఆడుతాడా? లేదా? అనేది అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. కానీ కోహ్లీ తుది పోరులో ఆడటం ఖాయమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో శుభ్‌మన్ గిల్‌తో కలిసి భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత విరాట్ వన్‌డౌన్‌లో ఆడుతాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్,, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య తర్వాత బ్యాటింగ్‌కు వస్తారు. దీంతో మరోసారి రిషబ్ పంత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితం కావాల్సిందే.
ఈ మ్యాచ్‌కు అత్యంత కీలకం స్పిన్ విభాగం. భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఉన్నారు. వారిలో నలుగురికి తుదిజట్టులో అవకాశం రావడం ఖాయం. గత మ్యాచుల్లోనూ ఇదే ఫార్ములాను టీమిండియా ప్రయోగించింది. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌తో బరిలోకి దిగనున్నది. అయితే ఒక్క మార్పు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత బలోపేతడం చేయడంతోపాటు కుడిచేతి వాటం స్పిన్నర్‌ను తీసుకోవాలనే ఉద్దేశంతో భారత్ ఉన్నట్లు సమాచారం. దీంతో కుల్‌దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడిస్తారని కథనాలు వస్తున్నాయి. సుందర్‌ను తీసుకుంటే 9వ నంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంటుందనేది మేనేజ్‌మెంట్ ఆలోచనగా ఉన్నది. ఇప్పటికే రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తితో కూడిన స్పిన్ విభాగం బలంగానే ఉన్నది. వారికి తోడుగా సుందర్‌ను తీసుకొస్తారని తెలుస్తోంది. అయితే తుది జట్టుపై టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.