ప్రపంచకప్ సూపర్ -8 లో నేడు హాట్ హాట్ ఫైట్!

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ ఆఖరి మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారత్ తో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఢీ కొనబోతోంది.

Advertisement
Update: 2024-06-24 12:16 GMT

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ ఆఖరి మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారత్ తో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఢీ కొనబోతోంది.

టీ-20 ప్రపంచకప్ సూపర్-8 దశ పోటీలు క్లైమాక్స్ కు చేరాయి. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా ఇప్పటికే..సూపర్-8 రౌండ్లోని రెండు బెర్త్ లు ఖాయం చేసుకోన్నాయి.

మిగిలిన రెండుబెర్త్ ల్లో భారత్ ఓస్థానాన్ని ఖాయం చేసుకోగా మరో బెర్త్ కోసం ఆసక్తికరమైన పోరు జరుగుతోంది.

డారెన్ సామీ స్టేడియంలో క్లైమాక్స్...

సెయింట్ లూకా లోని డారెన్ సామీ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే సూపర్-8 ఆఖరి మ్యాచ్..మాజీ చాంపియన్ ఆస్ట్ర్రేలియాకు చావోబతుకో సమరంలా మారింది.

సంచలనాల అప్ఘనిస్థాన్ చేతిలో అనుకోని పరాజయం చవిచూసిన ఆస్ట్ర్రేలియా..సెమీస్ చేరాలంటే హాట్ ఫేవరెట్ భారత్ తో జరిగే ఈ పోరులో నెగ్గితీరాల్సి ఉంది.

భారత్ చేతిలో ఓడినా...లేదా వర్షంతో మ్యాచ్ రద్దయినా ఆస్ట్ర్రేలియా ఇంటిదారి పట్టడం, అప్ఘనిస్థాన్ సెమీస్ చేరడం జరిగిపోతాయి.

భారత్ కు చెలగాటం.......

ప్రస్తుత ప్రపంచకప్ గ్రూప్ లీగ్ దశ నుంచి సూపర్ -8 రౌండ్ వరకూ ఆడిన ఆరుకు ఆరుమ్యాచ్ ల్లోనూ అజేయంగా నిలిచిన టాప్ ర్యాంకర్ భారత్..ఈరోజు ఆస్ట్ర్రేలియాతో జరిగే పోటీలో సైతం నెగ్గితీరగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉంది.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టు..గ్రూప్- ఏ లీగ్ లో మూడుమ్యాచ్ లు నెగ్గి టాపర్ గా నిలవడంతోపాటు..సూపర్ - 8 మొదటి రెండురౌండ్లలోనూ 10వ ర్యాంకర్ అప్ఘనిస్థాన్, 9వ ర్యాంకర్ బంగ్లాదేశ్ జట్లను అధిగమించడం ద్వారా సెమీస్ స్థానం దాదాపుగా ఖరారు చేసుకోగలిగింది.

సూపర్-8 ఆఖరిమ్యాచ్ లో సైతం కంగారూలను అధిగమించగలమన్న ధీమా రోహిత్ సేనలో కనిపిస్తోంది.

అదేజట్టుతో ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత్...

లీగ్ దశ నుంచి సూపర్-8 రౌండ్ వరకూ విరాట్ కొహ్లీ, జడేజా లాంటి కీలక ఆటగాళ్లు తడబడుతున్నా భారత్ మాత్రం విజయాలు సాధించడం ద్వారా అజేయంగా నిలిచింది. అమెరికా అంచె పోటీలలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ను, కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న సూపర్ - 8 రౌండ్ మ్యాచ్ ల్లో సిరాజ్ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను ఆడిస్తూ ఆశించిన ఫలితాలు సాధించగలిగింది.

ఆస్ట్ర్రేలియాతో జరిగే కీలక పోరులో సైతం ఎలాంటి మార్పులు లేని జట్టుతోనే భారత్ బరిలోకి దిగనుంది. మరోవైపు..అప్ఘనిస్థాన్ కొట్టిన దెబ్బతో ఢీలాపడిన కంగారూ జట్టు..స్పిన్ ఆల్ రౌండర్ ఆస్టన్ అగర్ ను తుదిజట్టులోకి తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సెమీస్ చేరాలంటే భారత్ ను ఓడించి తీరాల్సిన పరిస్థితి ఉండటంతో..ఆరునూరైనా నెగ్గితీరాలన్న లక్ష్యంతో ఆస్ట్ర్రేలియా పోటీకి సిద్ధమయ్యింది.

హైస్కోరింగ్ గ్రౌండ్లో.....

కరీబియన్ ద్వీపాలలో అత్యంత ఉక్కబోత వాతావరణం కలిగిన సెయింట్ లూషియా దీవిలోని డారెన్ సామీ స్టేడియం పిచ్ కు..బ్యాటర్ల స్వర్గంగా పేరుంది. భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల పోరు సైతం హైస్కోరింగ్ మ్యాచ్ గా జరిగే అవకాశం ఉందని స్టేడియం క్యూరేటర్ అంటున్నారు.

సెయింట్ విన్సెంట్ దీవి నుంచి కేవలం 12 నిముషాల విమాన ప్రయాణంతో సెయింట్ లూషియా ద్వీపానికి చేరిన కంగారూజట్టు పూర్తిస్థాయిలో రాణించడం ద్వారా భారత్ పై సంచలన విజయం సాధించగలనన్న ధీమాతో ఉంది. కేవలం 16 గంటల విశ్రాంతితో వరుసగా రెండోమ్యాచ్ కు కంగారూజట్టు సిద్దమయ్యింది.

మరోవైపు..బంగ్లాదేశ్ పైన నెగ్గిన భారతజట్టు 24 గంటల విశ్రాంతి అనంతరం మ్యాచ్ కు సమాయత్తమయ్యింది.

గతరాత్రి కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. భారత్- ఆస్ట్ర్రేలియాజట్ల మ్యాచ్ కు వర్షంతో అంతరాయం కలిగే అవకాశమే లేదని వాతావరణ శాఖ చెబుతోంది.

భారత్ 3- ఆస్ట్ర్రేలియా 2

2008 నుంచి 2022 టీ-20 ప్రపంచకప్ టోర్నీలలో భారత్, ఆస్ట్ర్రేలియాజట్లు ఇప్పటి వరకూ ఐదుసార్లు తలపడితే భారత్ 3 విజయాలు, 2 పరాజయాల రికార్డుతో ఉంది.

ట్రావిస్ హెడ్- వార్నర్ లాంటి భీకరమైన ఓపెనింగ్ జోడీ కలిగిన కంగారూ జట్టులో కెప్టెన్ మిషెల్ మార్ష్, మాక్స్ వెల్, మార్కుస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్ లాంటి ప్రమాదకరమైన బ్యాటర్లున్నారు. అయితే ..కరీబియన్ మందకొడి పిచ్ లపైన మాత్రం కంగారూ బ్యాటర్లు దారుణంగా విఫలమవుతూ వచ్చారు. ప్రధానంగా స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనలేక సతమతమవుతున్నారు.

భారత స్పిన్ త్రయం జడేజా, అక్షర్, కుల్దీప్ లతో పాటు స్వింగ్ కింగ్ జస్ ప్రీత్ బుమ్రాను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొనగలరన్న అంశంపైనే కంగారూజట్టు జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో సైతం భారత్ జోరు కొనసాగుతుందో..లేదో తెలుసుకోవాలంటే రాత్రి 12 గంటల వరకూ వేచిచూడక తప్పదు.

Tags:    
Advertisement

Similar News