టీ 20 ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌.. భారత్‌ పై ఆస్ట్రేలియా గెలుపు

చేజింగ్‌ లో చతికిల పడిన మహిళల జట్టు

Advertisement
Update:2024-10-13 23:19 IST

టీ 20 వరల్డ్‌ కప్‌ లో సెమీ ఫైనల్‌ కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌ లో భారత మహిళల జట్టు ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌ లో 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మహిళల జట్టు సెమీ ఫైనల్‌ కు చేరాలంటే పాకిస్థాన్‌ ప్రదర్శనపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్‌ సోమవారం తన చివరి లీగ్‌ మ్యాచ్ లో న్యూజిలాండ్‌ పై ఘన విజయం సాధిస్తేనే భారత్‌ నాలుగు పాయింట్లతో సెమీస్‌ కు చేరే అవకాశం ఉంటుంది. భారత మహిళల జట్టు మొదటి మ్యాచ్‌ లో న్యూజిలాండ్‌ చేతిలో, చివరి మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆదివారం జరిగిన హై ఓల్టేజీ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్‌ గ్రేస్‌ హారిస్‌ 40, కెప్టెన్‌ తహిలా మెక్‌ గ్రాత్‌, ఎల్సీ పెర్రీ 32 పరుగులు చొప్పున, లిచ్‌ ఫీల్డ్‌ 15, సౌథర్‌ ల్యాండ్‌ 10 పరుగులు చేశారు. ఇండియన్‌ బౌలర్లలో రేణుకా సింగ్‌, దీప్తి శర్మా తలా రెండు వికెట్లు పడగొట్టారు. శ్రేయాంకా పటేల్‌, పూజ, రాదా యాదవ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. 152 పరుగుల టార్గెట్‌ తో బరిలోకి దిగిన భారత జట్టు ఫస్ట్‌ పవర్‌ ప్లేలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు షెఫాలి వర్మ 20, స్మృతి మంథన ఆరు పరుగులు చేసి ఔట్‌ అయ్యారు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ 54 పరుగులతో అజేయంగా నిలిచినా అవతలి వైపు వరుసగా వికెట్లు పడుతుండటంతో టీమ్‌ ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీప్తి శర్మ 29, జేమియా 16 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అనబెల్‌ సౌథర్‌ ల్యాండ్‌, మోలినక్స్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. మేగం స్కాట్‌, గర్డెనర్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసింది.

Tags:    
Advertisement

Similar News