హోంగ్రౌండ్లో సన్ రైజర్స్ ధనాధన్ విన్!

ఐపీఎల్ -17వ సీజన్లో మాజీచాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ స్థానబలంతో చెలరేగిపోతోంది.

Advertisement
Update:2024-04-06 11:15 IST

ఐపీఎల్ -17వ సీజన్లో మాజీచాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ స్థానబలంతో చెలరేగిపోతోంది. హోంగ్రౌండ్లో వరుసగా రెండో గెలుపుతో లీగ్ టేబుల్ 5వ స్థానంలో నిలిచింది...

ఐపీఎల్ షో దేశవ్యాప్తంగా పలు నగరాలు వేదికగా అంచనాలకు మించి సాగిపోతోంది. హాట్ ఫేవరెట్ జట్లకు షాక్ వెంట షాక్ తగులుతూ వస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ కు తెలుగునేలపై వరుసగా రెండో పరాజయం ఎదురయ్యింది.

విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కంగుతిన్న సూపర్ కింగ్స్ ను ..హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో సన్ రైజర్స్ 6 వికెట్లతో చిత్తు చేసింది.

చెన్నైకి హైదరాబాద్ పగ్గాలు....

ప్రస్తుత సీజన్ లీగ్ లో మిశ్రమఫలితాలు ఎదుర్కొంటున్న సన్ రైజర్స్ హోంగ్రౌండ్ హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో మాత్రం చెలరేగిపోతోంది. గతవారం ముంబై ఇండియన్స్ ను రికార్డు స్కోరుతో చిత్తు చేసిన సన్ రైజర్స్ జట్టు ప్రస్తుత చాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్ తో జరిగిన పోరులోనూ అదేజోరు కొనసాగించింది.

ఈ కీలక పోరులో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న సన్ రైజర్స్ ప్రత్యర్థిని 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగుల స్కోరుకే కట్టడి చేసింది.చెన్నై బ్యాటర్లలో ఓపెనర్లు రుతురాజ్ గయక్వాడ్ 26, రచిన్ రవీంద్ర 12, అజింక్యా రహానే 35, శివం దూబే 45, రవీంద్ర జడేజా 31, డారిల్ మిచిల్ 13 పరుగుల స్కోర్లు మాత్రమే సాధించగలిగారు.

సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఉనద్కత్, నటరాజన్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

మర్కరమ్, అభిషేక్ షో.....

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 166 పరుగులు చేయాల్సిన సన్ రైజర్స్ కు ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్- అభిషక్ శర్మ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే ఓవర్లలోనే చెలరేగిపోయారు.

మొదటి 2.4 ఓవర్లలో 46 పరుగులు, 9.4 ఓవర్లలో 2 వికెట్లకు 106 పరుగులు స్కోరు సాధించడం ద్వారా సన్ రైజర్స్ విజయానికి మార్గం సుగమం చేసుకొంది. మొదటి 3.3 ఓవర్లలో 51 పరుగులు చేయటం ద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డు నెలకొల్పింది.

ఐపీఎల్ 17 సీజన్ల చరిత్రలో అత్యంత వేగంగా అర్థశతకం సాధించిన జట్టుగా సన్ రైజర్స్ రికార్డుల్లో చేరింది. యువసంచలనం అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు, మరో ఓపెనర్ హెడ్ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్ తో 31 పరుగులు సాధించారు. వన్ డౌన్ బ్యాటర్ మర్కరమ్ 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసి అవుటయ్యాడు.

చివరకు సన్ రైజర్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులతో విజయం పూర్తి చేసింది. సన్ రైజర్స్ విజయంలో ప్రధానపాత్ర వహించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ కు 6వ గెలుపు...

చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థిగా హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఇది కేవలం 6వ గెలుపు మాత్రమే. ఇప్పటి వరకూ రెండుజట్లూ 20సార్లు తలపడితే...చెన్నై 14, హైదరాబాద్ 6 విజయాల రికార్డుతో ఉన్నాయి. సన్ రైజర్స్ ప్రత్యర్థిగా 73.68 విజయశాతం ఉన్న చెన్నై సూపర్ కింగ్స్..ప్రస్తుత సీజన్ పోరులో మాత్రం తేలిపోయింది.

ఈ రోజు జరిగే పోరులో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా రాత్రి 7-30కి ఈ హాట్ హాట్ పోరు ప్రారంభంకానుంది.

Tags:    
Advertisement

Similar News