హైదరాబాద్ సన్ రైజర్స్ కీలక పోరుకు వానముప్పు!

హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ ఆడే ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్ కు వానముప్పు పొంచి ఉంది.

Advertisement
Update:2024-05-16 17:45 IST

హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ ఆడే ఐపీఎల్ ప్రస్తుత సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్ కు వానముప్పు పొంచి ఉంది.

మాజీ చాంపియన్ హైదరాబాద్ సన్ రైజర్స్ ను ఓ వైపు ప్లే-ఆఫ్ బెర్త్ ఊరిస్తుంటే..మరోవైపు వరుణదేవుడు భయపెడుతున్నాడు. హోంగ్రౌండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ రోజు రాత్రి 7-30కి ప్రారంభం కావాల్సిన ఈ కీలక పోరులో మరో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్రత్యర్థిగా ఉంది.

66వ మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యం...

ప్రస్తుత సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా జరిగే 66వ మ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా నిలిచింది. అంతేకాద..హైదరాబాద్ వేదికగా జరిగే ప్రస్తుత సీజన్ ఆఖరి హోమ్ మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం.

ఇప్పటి వరకూ ఆడిన మొదటి 12 రౌండ్ల మ్యాచ్ ల్లో 7 విజయాలు, 5 పరాజయాలతో 14 పాయింట్లు సాధించిన సన్ రైజర్స్..చివరి రెండు రౌండ్లలో మరో 2 పాయింట్లు సాధించినా ప్లే- ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

తన మొదటి 13 రౌండ్లలో 5 విజయాలు, 7 పరాజయాలతో 10 పాయింట్లు సాధించడం ద్వారా ఇప్పటికే ప్లే-ఆఫ్ రేస్ నుంచి నిష్క్ర్రమించిన గుజరాత్ టైటాన్స్ కు ప్రస్తుత సీజన్లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కానుంది. ప్లే-ఆఫ్ రౌండ్ చేరకున్నా..ఆఖరి మ్యాచ్ ను విజయంతో ముగించాలన్న పట్టుదల శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ లో కనిపిస్తోంది.

వారంరోజుల విరామం తరువాత...

గత వారం రోజుల విశ్రాంతి తరువాత హైదరాబాద్ సన్ రైజర్స్ తన 13వ రౌండ్ మ్యాచ్ కు సిద్ధమయ్యింది. మే8న చివరిసారిగా లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడి..10 వికెట్ల విజయం సాధించిన సన్ రైజర్స్ తగిన విశ్రాంతితో ఇప్పుడు పవర్ ఫుల్ గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ ను ఓడించగలిగితేనే సన్ రైజర్స్ కు ప్లే-ఆఫ్ రౌండ్ అవకాశాలు మెరుగవుతాయి.

గత మ్యాచ్ లో తమ జట్టు విజయలక్ష్యం 167 పరుగుల్ని కేవలం 9.4 ఓవర్లలోనే సాధించిన సన్ రైజర్స్ ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ..ఈ రోజు జరిగే ఈ కీలక పోరులో ప్రధానపాత్ర వహించబోతున్నారు.

మొదటి వికెట్ కు ఈ ఇద్దరూ ఇచ్చే మెరుపు ఆరంభంపైనే సన్ రైజర్స్ జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే-ఆఫ్ బెర్త్ లు ఖాయం చేసుకోగా..మిగిలిన రెండు స్థానాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఆఖరి రెండురౌండ్ల మ్యాచ్ ల్లో కనీసం ఒక్క విజయం సాధించినా సన్ రైజర్స్ కు ప్లే-ఆఫ్ రౌండ్ చేరే అవకాశం ఉంది.

భయపెడుతున్న వాన...

సన్ రైజర్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు వర్షంతో అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. మ్యాచ్ రోజున మధ్యాహ్నం నుంచే వానపడడంతో..రాజీవ్ స్టేడియం సిబ్బంది..వికెట్ తో పాటు అవుట్ ఫీల్డ్ ను సైతం కవర్లతో కప్పి ఉంచారు.

గ్రౌండ్లో నీరు నిలిచినా అత్యుత్తమ డ్రైనేజీ సదుపాయం ఉండడంతో మ్యాచ్ సకాలంలో ప్రారంభించగలమన్న ధీమాను నిర్వాహక హైదరాబాద్ క్రికెట్ సంఘం వ్యక్తం చేస్తోంది.

ఒకవేళ మ్యాచ్ నిర్ణిత సమయానికి ప్రారంభంకాకున్నా..18 లేదా 16 ఓవర్లకు కుదించి నిర్వహించే అవకాశాలు సైతం లేకపోలేదు. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఓడినా వచ్చిన నష్టం ఏమీలేదు. అదే సన్ రైజర్స్ ఓడితే మాత్రం ప్లే-ఆఫ్ బెర్త్ క్లిష్టం గా మారిపోతుంది.

ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ నిబంధనను రెండుజట్లూ ఈ మ్యాచ్ లో పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నాయి.

హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్- గుజరాత్ టైటాన్స్ తలపడటం ఇదే మొదటిసారి. రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే సన్ రైజర్స్ ఒక్కగెలుపుతో ఉంటే..గుజరాత్ 3 విజయాల రికార్డుతో ఉంది.

గుజరాత్ స్పిన్ జోడీ రషీద్ ఖాన్, నూర్ మహ్మద్ సత్తాకు హైదరాబాద్ బ్యాటర్లు పరీక్షకానున్నారు.

సన్ రైజర్స్ డాషింగ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ సాధించిన మొత్తం 583 పరుగుల్లో 66 శాతం పరుగులు పవర్ ప్లే ఓవర్లలో సాధించినవే కావడం ఓ రికార్డు గా మిగిలిపోతుంది. ట్రావిస్ హెడ్ 385 పరుగులు పవర్ ప్లే ఓవర్లలో సాధించగలిగాడు. మరో ఓపెనర్ అభిషేక్ 71.07 శాతం పరుగులు పవర్ ప్లే ఓవర్లలో సాధించడం ద్వారా సన్ రైజర్స్ విజయాలలో ప్రధాన పాత్ర వహించాడు.

ఫోర్లు, సిక్సర్ల బాదుడులో రికార్డు..

ప్రస్తుత సీజన్లో రెండు అత్యధిక రికార్డు స్కోర్లు సాధించిన సన్ రైజర్స్ ఫోర్లు, సిక్సర్ల బాదుడులోనూ రికార్డుల మోత మోగించింది. ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 12 రౌండ్ల మ్యాచ్ ల్లో సన్ రైజర్స్ 171 ఫోర్లు, 146 సిక్సర్లతో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

అభిషేక్ శర్మ 35 సిక్సర్లతో..నంబర్ వన్ సిక్సర్ హిట్టర్ గా నిలిచాడు. ఈ కీలక పోరు గుజరాత్ టైటాన్స్ కు చెలగాటం..సన్ రైజర్స్ కు ప్లే-ఆఫ్ సంకటంగా మారింది.

అయితే..హోంగ్రౌండ్ రాజీవ్ స్టేడియంలో ఆడుతున్న కారణంగా సన్ రైజర్స్ స్థాన బలంతో చెలరేగిపోయే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News