వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా!
పాకిస్థాన్ తో తొలి టెస్ట్‌లో సఫారీల థ్రిల్లింగ్ విక్టరీ
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కు సౌత్ ఆఫ్రికా ఎంపికైంది. పాకిస్థాన్ తో జరిగిన మొదటి టెస్టులో సఫారీ టీమ్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దీంతో వచ్చే ఏడాది జూన్ 11 నుంచి 16 వరకు జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. ఫైనల్ రేసులో తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా, ఇండియా ఉన్నాయి. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని గెలుచుకునే జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరే అవకాశముంది. దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 11 మ్యాచుల్లో ఏడు టెస్టులు గెలిచింది. మూడు మ్యాచుల్లో ఓడి ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. మొత్తం 66.67 పర్సంటేజీతో ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా 15 టెస్టుల్లో 9 గెలిచి, నాలుగింటిలో ఓడింది. రెండు మ్యాచ్ లను డ్రా చేసుకుంది. 55.89 పర్సంటేజీతో రెండో స్థానంలో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండియాతో నాలుగో టెస్టు కొనసాగుతుండగా మరో మ్యాచ్ ఉంది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా తలపడాల్సి ఉంది. ఇండియా 17 టెస్టు మ్యాచుల్లో 9 మ్యాచుల్లో విజయం సాధించింది. ఆరింటిలో ఓడి, రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. 55.89 పర్సంటేజీతో మూడో స్థానంలో ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగో మ్యాచ్ ఫలితం సోమవారం తేలనుంది. చివరి టెస్టు ఆడాల్సి ఉంది.
సెంచూరియన్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను రెండు వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 211 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 301 పరుగులు చేసింది. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో 237 పరుగులు చేసింది. 147 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ బవుమా 40 పరుగులు, మార్కక్రమ్ 37 పరుగులు చేశారు. మరోవైపు వరుస వికెట్లు పడుతుండటంతో పాక్ విజయం ఖాయమని అందరూ లెక్కలు వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో కసిగో రబాడా 26 బంతుల్లో ఐదు ఫోర్లతో 31 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మార్కో జాన్సన్ 16 పరుగులతో రబాడాకు అండగా నిలిచాడు. దీంతో రెండు వికెట్ల తేడాతో పాక్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది.