2వేల పరుగుల క్లబ్ లో శుభ్ మన్ గిల్!
ఐపీఎల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 2వేల పరుగుల మైలురాయిని చేరుకొన్నాడు.
ఐపీఎల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 2వేల పరుగుల మైలురాయిని చేరుకొన్నాడు...
ఐపీఎల్ 16వ సీజన్ రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా జరిగిన మూడోరౌండ్ పోరులో గుజరాత్ టైటాన్స్ యువఓపెనర్ శుభ్ మన్ గిల్ 2వేల పరుగుల మైలురాయిని చేరుకోగలిగాడు.
హోంగ్రౌండ్ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మూడోరౌండ్ పోరులో గిల్ 39 పరుగుల స్కోరు సాధించడం ద్వారా ఈ ఘనతను సాధించాడు.
23 ఏళ్ల వయసులోనే...
గుజరాత్ టైటాన్స్ తన అరంగేట్రం సీజన్ లోనే విజేతగా నిలవడంలో ఓపెనర్ గా కీలక పాత్ర పోషించిన 23 సంవత్సరాల శుభ్ మన్ గిల్ తన 74వ ఇన్నింగ్స్ లో 2వేల పరుగుల రికార్డును పూర్తి చేయగలిగాడు.
ప్రస్తుత సీజన్ మూడోరౌండ్ పోటీల వరకూ కెరియర్ లో 77 మ్యాచ్ లు ఆడిన గిల్ 74 ఇన్నింగ్స్ లో 12 సార్లు నాటౌట్ గా నిలవడం ద్వారా 2016 పరుగులు సాధించాడు.
ఇందులో 15 హాఫ్ సెంచరీలతో..96 పరుగుల అత్యధిక స్కోరుతో 126.24 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు.
గిల్ 32.52 సగటుతో పాటు 202 బౌండ్రీలు, 50 సిక్సర్లు బాదడం విశేషం. ప్రస్తుత సీజన్ మూడోరౌండ్ పోరులో కోల్ కతాపై 31 బంతుల్లో 5 బౌండ్రీలతో 39 పరుగుల స్కోరుకు నైట్ రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్ కి చిక్కాడు.
2018 సీజన్లో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్రత్యర్థిగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన పోరులో నైట్ రైడర్స్ తరపున గిల్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.గత సీజన్ వేలం ద్వారా గుజరాత్ టైటాన్స్ కోట్ల రూపాయలకు శుభ్ మన్ గిల్ తనజట్టులో చేర్చుకొంది.
2018లో కోటీ 80 లక్షల ధర పలికిన గిల్..2022 సీజన్ వేలంలో 8 కోట్ల రూపాయల ధరను సాధించాడు.కేవలం నాలుగు సీజన్ల వ్యవధిలోనే గిల్ తన ఆటతీరును మెరుగు పరచుకోడం ద్వారా 6 కోట్ల 20 లక్షల రూపాయల మేర తన విలువను పెంచుకోగలిగాడు.