టీమ్ ఇండియాకు షాక్.. ఆ ఆటగాడు వరల్డ్ కప్ నుంచి ఔట్
ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న భారత జట్టు దూకుడు మీద ఉన్న దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనున్నది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించడంతో పాటు, మెరుగైన రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దూకుడు మీద ఉన్న టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీకి దూరమైనట్లు జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ మేరకు ఐసీసీ ప్రకటన చేసింది. గాయం కారణంగానే హార్దిక్ టోర్నీకి దూరమయ్యాడని చెప్పింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో బౌలింగ్ చేస్తూ, బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. గాయం చిన్నదే అనుకొని రెండు, మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అయితే పరీక్షల అనంతరం గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది. దీంతో అతడికి పూర్తిగా విశ్రాంతి ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. కాగా, హార్దిక్ పాండ్యా టోర్నీకి దూరమైనట్లు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అతని స్థానంలో వేరే ప్లేయర్‌ను తీసుకునేందుకు టీమ్ ఇండియాకు ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ అనుమతి ఇచ్చింది. హార్దిక్ పాండ్యా స్థానంలో యువ బౌలర్ ప్రసిధ్ కృష్ణకు చోటు కల్పించినట్లు బీసీసీఐ తెలిపింది.
కాగా ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న భారత జట్టు దూకుడు మీద ఉన్న దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనున్నది. కోల్‌కతా వేదికగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. లీగ్ దశను అగ్రస్థానంతో ముగించాలని భారత్ పట్టుదలతో ఉన్నది. దక్షిణాఫ్రికా మీద గెలిస్తే.. ఆ తర్వాత నెదర్లాండ్స్ మీద సునాయాస విజయంతో భారత్ టేబుల్ టాపర్‌గా నిలుస్తుంది. ఈ క్రమంలో కీలకమైన ఆల్‌రౌండర్ లేకపోవడం భారత్‌కు నిరాశ కలిగించే వార్తే. అయితే మిగిలిన ప్లేయర్లు మంచి ఫామ్‌లో ఉండటం తప్పకుండా కలిసి వస్తుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పైగా భారత బౌలర్లు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.