ప్రపంచకప్‌కు ముందు ఆసీస్‌తో సిరీస్.. పదేళ్ల తర్వాత కొత్త బ్రాడ్‌కాస్టర్‌ లైవ్ టెలికాస్ట్

మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ మొహలీ, రెండో మ్యాచ్ ఇండోర్, మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరుగనున్నది.

Advertisement
Update:2023-09-15 19:38 IST

ఇండియా వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్ కప్-2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్నది. అంతకు ముందే సెప్టెంబర్ 29 నుంచి వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. టీమ్ ఇండియా అక్టోబర్ 3న నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్నది. స్వదేశంలో టీమ్ ఇండియా వన్డే మ్యాచ్ ఆడి ఇప్పటికే ఆరు నెలలు గడిచింది. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా వన్డే మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలతో బిజీగా గడిపేసింది. కానీ స్వదేశీ గడ్డపై ఒక్క వన్డే మ్యాచ్ కూడా గత ఆరు నెలలుగా ఆడలేదు.

కీలకమైన వన్డే వరల్డ్ కప్ ముందు కేవలం ఒకే వార్మప్ మ్యాచ్.. అది కూడా నెదర్లాండ్స్‌లో ఉండటంతో బీసీసీఐ కూడా ఆలోచించి మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియాతో ప్లాన్ చేసింది. ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ (ఎఫ్‌టీపీ)లో ఇది లేకపోయినా.. వన్డే వరల్డ్ కప్ ఆతిథ్య దేశంగా ఈ మినీ ద్వైపాక్షిక సిరీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.

ఆసియా కప్ ఫైనల్‌లో ఇండియా, శ్రీలంక జట్లు ఆదివారం (సెప్టెంబర్ 17) తలపడనున్నాయి. ఆ వెంటనే భారత జట్టు ఇండియాకు చేరుకొని ఆస్ట్రేలియా సిరీస్‌కు సన్నద్దం కానున్నది. మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ మొహలీ, రెండో మ్యాచ్ ఇండోర్, మూడో మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరుగనున్నది. కాగా, ఆసియా కప్ తర్వాత టీమ్ ఇండియా క్రికెటర్లకు విశ్రాంతి ఇస్తారా? లేదంటే నేరుగా ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం మొహలీకి పంపిస్తారా అనేది తేలాల్సి ఉన్నది. స్వదేశీ గడ్డపై ఆసీస్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడటం వల్ల భారత జట్టుకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మ్యాచ్ షెడ్యూల్..

తొలి వన్డే - సెప్టెంబర్ 22 - మొహలీ

రెండో వన్డే - సెప్టెంబర్ 24 - ఇండోర్

మూడో వన్డే - సెప్టెంబర్ 27 - రాజ్‌కోట్

అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 నుంచి ప్రారంభం అవుతాయి.

ఇక స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌కు సెలవు..

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ఈ మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ నుంచి కొత్త బ్రాడ్ కాస్టర్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. గత 10 ఏళ్లుగా బీసీసీఐకి అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్న స్టార్ ఇండియా గడువు ముగిసింది. ఇటీవలే నిర్వహించిన టెండర్లలో స్వదేశీ సిరీస్‌ల ప్రసార హక్కులను జియో సినిమా, స్పోర్ట్స్ 18 దక్కించుకున్నది. ఆస్ట్రేలియా సిరీస్ నుంచే భారత‌లో వయకామ్ జియో స్వదేశీ మ్యాచ్‌ల ప్రసారం ప్రారంభించనున్నది. అయితే వరల్డ్ కప్ ఐసీసీ టోర్నీ కావడంతో ఆ మ్యాచ్‌లు మాత్రం స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతాయి.

Tags:    
Advertisement

Similar News