టీ-20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్...రోహిత్ కన్నీరుమున్నీరు!

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ భారత్..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకొంది. ఇంగ్లండ్ పై భారీవిజయంతో బదులుతీర్చుకొంది.

Advertisement
Update: 2024-06-28 04:44 GMT

ధూమ్ ధామ్ టీ-20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ భారత్..2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు చేరుకొంది. ఇంగ్లండ్ పై భారీవిజయంతో బదులుతీర్చుకొంది.

టీ-20 టాప్ ర్యాంక్ జట్టు భారత్...2024 ప్రపంచకప్ కు గెలుపుదూరంలో నిలిచింది. దశాబ్దకాలం తరువాత ఐసీసీ టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్ కు అర్హత సంపాదించింది.

గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా ముగిసిన రెండోసెమీఫైనల్లో భారత్ 68 పరుగులతో ఇంగ్లండ్ ను చిత్తు చేయడం ద్వారా 2023 ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోగలిగింది.

మందకొడి పిచ్ పై రోహిత్, సూర్య బ్యాటింగ్ జోరు...

వరుణదేవుడి దోబూచులాటల నడుమ ప్రారంభమైన ఈ రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ కీలక టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోడంతో..భారత్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది.

విరాట్- రోహిత్ లతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ కు 2.4 ఓవర్ల ఆటలోనే గట్టి దెబ్బ తగిలింది. సిక్సర్ షాట్ తో తన బ్యాటింగ్ మొదలు పెట్టిన విరాట్ 9 బంతుల్లో 9 పరుగులకు అవుట్ కావడంతో 19 పరుగుల స్కోరుకే భారత్ మొదటి వికెట్ నష్టపోయింది. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన రిషభ్ పంత్ సైతం నిలదొక్కుకోలేకపోయాడు. కేవలం 4 పరుగులకే సామ్ కరెన్ బౌలింగ్ లో దొరికిపోడంతో భారత్ 40 పరుగుల స్కోరువద్ద 2 వికెట్ నష్టపోయి ఎదురీత మొదలు పెట్టింది.

ముంబైజోడీ కీలక భాగస్వామ్యం...

భారత్ రెండుటాపార్డర్ వికెట్లు నష్టపోయి..ఎదురీదుతున్న తరుణంలో జట్టును ఆదుకొనే బాధ్యతను కెప్టెన్ రోహిత్ తో కలసి మిస్టర్ 360 హిట్టర్ సూర్యకుమార్ తీసుకొన్నాడు.

ఈ ఇద్దరూ దూకుడుగా ఆడుతున్న తరుణంలో వర్షం పడడంతో 40 నిముషాలపాటు ఆట నిలిచిపోయింది. ఆ తరువాత కొనసాగిన ఆటలో ముంబైజోడీ కళ్లు చెదిరే షాట్లతో ఎదురుదాడి మొదలు పెట్టారు.

అనూహ్యమైన బౌన్స్ తో..బ్యాటింగ్ కు అంతగా అనువుకాని పిచ్ పైన హిట్ మ్యాన్ రోహిత్, మిస్టర్ టీ-20 హిట్టర్ సూర్య తమకే సాధ్యమైన పలు రకాల షాట్లతో స్కోరుబోర్డును పరుగులెత్తించారు. 3వ వికెట్ కు 73 పరుగుల కీలక భాగస్వామ్యంతో భారత మ్యాచ్ విన్నింగ్ స్కోరుకు గట్టి పునాది వేశారు.

రోహిత్ 32వ హాఫ్ సెంచరీ..

ప్రస్తుత ప్రపంచకప్ సూపర్-8 ఆఖరి రౌండ్ మ్యాచ్ లో ఆస్ట్ర్రేలియా పై 92 పరుగుల స్కోరుతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన కెప్టెన్ రోహిత్..ఇంగ్లండ్ తో సెమీస్ పోరులో సైతం చెలరేగిపోయాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు సాధించి..లెగ్ స్పిన్నర్ రషీద్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

టీ-20 క్రికెట్లో రోహిత్ కు ఇది 32వ హాఫ్ సెంచరీకాగా..ప్రపంచకప్ లో 10వ అర్థశతకం. అంతేకాదు..ప్రస్తుత ప్రపంచకప్ లో రోహిత్ కు మూడో హాఫ్ సెంచరీ. గ్రూప్ -ఏ లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఐర్లాండ్ పై అజేయ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్..సూపర్-8లో ఆస్ట్ర్రేలియాపైన, సెమీస్ లో ఇంగ్లండ్ పైన అర్థశతకాలు బాదడం విశేషం.

రోహిత్ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాతో కలసి సూర్యకుమార్ తన పోరాటం కొనసాగించాడు. 36 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీకి 3 పరుగుల దూరంలో అవుటయ్యాడు.

మిడిలార్డర్ కీలక పరుగులు....

15.4 ఓవర్లలో భారత్ 4 వికెట్లకు 124 పరుగులు మాతమే చేసిన తరుణంలో బ్యాటింగ్ కు దిగిన హార్థిక్ పాండ్యా 13 బంతుల్లో 23 పరుగులు, రవీంద్ర జడేజా 17 నాటౌట్, అక్షర్ పటేల్ 10 పరుగులు సాధించడంతో భారత్ 20 ఓవర్లలో 171 పరుగుల స్కోరుతో విజయానికి మార్గం సుగమం చేసుకొంది.

ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ 3 వికెట్లు, టోప్లే, కరెన్, రషీద్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు పట్టపగలే చుక్కలు చూపించారు. ప్రధానంగా స్పిన్ జోడీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెలరేగిపోయారు.

16.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ ప్యాకప్...

బ్యాటింగ్ అంతతేలికకాని పిచ్ పైన ఇంగ్లండ్ బ్యాటర్లు తెల్లమొకం వేశారు. తొలిఓవర్ నుంచే భారత బౌలర్లు వికెట్ కు అనుగుణంగా బౌల్ చేసి..పవర్ ప్లే దశలోనే పట్టుబిగించారు.

ఓపెనర్లు సాల్ట్ 5, కెప్టెన్ బట్లర్ 23, మోయిన్ అలీ 8, బెయిర్ స్టో 0, సామ్ కరెన్ 2 పరుగులకు అవుట్ కావడంతో ఇంగ్లండ్ మరి కోలుకోలేకపోయింది.

భారత యార్కర్లకింగ్ బుమ్రా, స్పిన్ జాదూ కుల్దీప్ ను ఎలా ఎదుర్కొనాలో అర్థంకాక ఇంగ్లండ్ జట్టు 16.4 ఓవర్లలోనే కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 68 పరుగుల భారీవిజయంతో ఫైనల్ చేరడంతో పాటు..గత ప్రపంచకప్ సెమీస్ లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన 10 వికెట్ల ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకొన్నట్లయ్యింది.

భారత బౌలర్లలో కుల్దీప్, అక్షర్ పటే్ల్ చెరో 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అక్షర్ 10 పరుగులు చేయడంతో పాటు..23 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు.

రోహిత్ కంట కన్నీరు...

భారతజట్టు విజయాలలో ప్రధానపాత్ర పోషిస్తూ..నాయకుడంటే ఎలా ఉండాలో చాటి చెప్పిన కెప్టెన్ రోహిత్ శర్మ..తనజట్టు ఫైనల్స్ చేరుకోడంతో పట్టలేని ఆనందంతో తీవ్రభావోద్వేగానికి గురయ్యాడు.

గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ చేరిన వెంటనే కుర్చీలోకి కూలబడి కంటనీరు పెట్టుకోడంతో మాజీ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఓదార్చాల్సి వచ్చింది.

ఈనెల 29న బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగే టైటిల్ సమరంలో తొలిసారిగా ఫైనల్ చేరిన సౌతాఫ్రికాజట్టుతో భారత్ తలపడనుంది.

Tags:    
Advertisement

Similar News