'హిట్ మ్యాన్ హిట్'..భారత్ చేతిలో ఆస్ట్ర్రేలియా స్మాష్!

టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ ఐదోసారి చేరుకొంది. సూపర్-8 ఆఖరిరౌండ్ పోరులో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసింది.

Advertisement
Update: 2024-06-25 03:32 GMT

టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ ఐదోసారి చేరుకొంది. సూపర్-8 ఆఖరిరౌండ్ పోరులో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసింది.

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. గ్రూప్ లీగ్ దశ నుంచి సూపర్-8 వరకూ టాప్ ర్యాంకర్ భారత్ ఆరు వరుస విజయాలతో సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకొంది.

ఐదోసారి సెమీస్ లో భారత్....

కరీబియన్ ద్వీపం సెయింట్ లూషియాలోని డారెన్ సామీ స్టేడియం వేదికగా జరిగిన సూపర్-8 ఆఖరి రౌండ్ పోరులో భారత్ 24 పరుగులతో ఆస్ట్ర్రేలియాను అధిగమించడం ద్వారా..ఆల్ విన్ రికార్డుతో సెమీస్ లో అడుగుపెట్టింది.

2007 ప్రారంభ ప్రపంచకప్ నుంచి ప్రస్తుత 2024 ప్రపంచకప్ వరకూ సెమీస్ చేరడం భారత్ కు ఇది 5వసారి కావడం ఓ రికార్డు. 17 సంవత్సరాల క్రితం తొలిసారిగా టీ-20 ప్రపంచకప్ అందుకొన్న భారత్..మరో ట్రోఫీ కోసం గత 17 సంవత్సరాలుగా ఎదురుచూస్తూ వస్తోంది.

జట్టును ముందుండి నడిపించే నాయకుడు...

టీ-20 ఫార్మాట్లో ప్రస్తుతం టాప్ ర్యాంకర్ గా ఉన్న భారత్...హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నాయకత్వంలో మరోసారి టైటిల్ వేటకు దిగింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో టైటిల్ అంచుల వరకూ వచ్చి ఓడిన భారత్..ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ గెలుచుకోడం ద్వారా ఆలోటును భర్తీ చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.

రాహుల్ ద్రావిడ్ చీఫ్ కోచ్ గా, రోహిత్ శర్మ కెప్టెన్ గా బరిలో నిలిచిన భారత్ ..తొలిదశ గ్రూప్- ఏ పోరులో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాజట్లను చిత్తు చేసింది. ఇక రెండోదశ సూపర్-8 రౌండ్లో సైతం అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లతో పాటు పవర్ ఫుల్ ఆస్ట్ర్రేలియాను సైతం అధిగమించడం ద్వారా నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

ప్రపంచ 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాతో జరిగిన కీలక ఆఖరి రౌండ్ సమరంలో భారత్ ను విజేతగా నిలపడంలో కెప్టెన్ రోహిత్ ప్రధానపాత్ర వహించాడు.

రోహిత్ శర్మ రికార్డుల హ్యాట్రిక్....

కరీబియన్ ద్వీపాలలోని క్రికెట్ వేదికల్లో బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండే డారెన్ సామీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన హైస్కోరింగ్ మహాపోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. సహఓపెనర్ విరాట్ కొహ్లీ 5 బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగినా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా రోహిత్ వీరవిహారం చేశాడు. గ్రౌండ్ నలుమూలలకూ తనదైన శైలిలో షాట్లు కొట్టి కంగారూ బౌలింగ్ ఎటాక్ ను కకావికలు చేశాడు.

ఆస్ట్ర్రేలియా తురుపుముక్క మిషెల్ స్టార్క్ ఓ ఓవర్లో రోహిత్ 4 సిక్సర్లు, ఓ ఫోర్ బాదడం ద్వారా శివమెత్తిపోయాడు.

19 బంతుల్లోనే రోహిత్ మెరుపు హాఫ్ సెంచరీ..

రోహిత్ శర్మ కేవలం 19 బంతుల్లోనే సునామీ హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా భారత్ స్కోరు 205కు చేరడంలో ప్రధానపాత్ర వహించాడు. ప్రస్తుత ప్రపంచకప్ లో సూపర్ -8 రౌండ్ వరకూ అత్యంత వేగంగా ..అతితక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డు నెలకొల్పాడు.

రోహిత్ మొత్తం 41 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత ఇతర బ్యాటర్లలో పంత్ 15, సూర్య 31, శివం దూబే 28, పాండ్యా 27 పరుగులు సాధించారు. భారత్ ప్రత్యర్థి ఎదుట 206 పరుగుల లక్ష్యం ఉంచడంతోనే మరో రికార్డు భారత్ వశమయ్యింది.ప్రస్తుత ప్రపంచకప్ లో 200కు పైగా పరుగులు సాధించిన తొలిజట్టు ఘనతను సైతం రోహిత్ సేన దక్కించుకోగలిగింది.

భారత కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ...టీ-20 చరిత్రలోనే 200కు పైగా సిక్సర్లు సాధించిన తొలి బ్యాటర్ గా, అత్యధిక పరుగులు సాధించిన మొనగాడిగా జంట ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు.

కంగారూ బ్యాటర్లకు భారత్ బౌలర్ల పగ్గాలు...

మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 206 పరుగులు చేయాల్సిన ఆస్ట్ర్రేలియా బ్యాటర్లను భారత బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేయగలిగారు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 76 పరుగులు, కెప్టెన్ మిషెల్ మార్ష్ 28 బంతుల్లో 37 పరుగులతో ఎదురుదాడికి దిగినా అక్షర్ పటేల్ పట్టిన సూపర్ క్యాచ్ తో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరకు కంగారూజట్టు 181 పరుగులు మాత్రమే చేయడం ద్వారా 24 పరుగుల పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్2 వికెట్లు, బుమ్రా, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు.

మూడురౌండ్ల సూపర్ -8 దశలో ఆస్ట్ర్రేలియాకు ఇది వరుసగా రెండో ఓటమి కావడంతో సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్ర్రమించే ప్రమాదం పొంచి ఉంది.

భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

జూన్ 27న గయానా ప్రావిడెన్స్ స్టేడియం వేదికగా జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

Tags:    
Advertisement

Similar News