బీసీసీఐ చైర్మన్ గా నేడు రోజర్ బిన్నీ ఎన్నిక
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ నేడు లాంఛనంగా ఎంపికకానున్నారు
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా భారత మాజీ ఆల్ రౌండర్ రోజర్ బిన్నీ నేడు లాంఛనంగా ఎంపికకానున్నారు. ముంబైలో ఈరోజు జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశంలో కొత్తకార్యవర్గాన్ని ఖరారు చేయనున్నారు...
బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశానికి ముంబైలో ఈరోజు రంగం సిద్ధమయ్యింది. బోర్డుకు అనుబంధంగా ఉన్న 30కి పైగా క్రికెట్ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.
2019 నుంచి 2022 సెప్టెంబర్ వరకూ విధులు నిర్వర్తించిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కార్యవర్గం పదవీకాలం ముగియటంతో సరికొత్త కార్యవర్గం కూర్పుపై ఇప్పటికే బోర్డు పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు.
సౌరవ్ గంగూలీ స్థానంలో బోర్డు చైర్మన్ గా రోజర్ బిన్నీ ఎన్నిక కావడం కేవలం లాంఛనం మాత్రమే. కర్నాటక క్రికెట్ సంఘం ప్రతినిధిగా బోర్డు చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన 67 సంవత్సరాల రోజర్ బిన్నీ బీసీసీఐ 36వ చైర్మన్ గా ఎంపిక కానున్నారు.
బోర్డు కార్యదర్శిగా గత మూడేళ్లుగా బాధ్యతలు నిర్వర్తించిన కేంద్రహోంమంత్రి తనయుడు, గుజరాత్ క్రికెట్ సంఘం ప్రతినిధి జే షా రానున్న మూడేళ్లపాటు అదే పదవిలో కొనసాగనున్నారు.
ఇప్పటి వరకూ బోర్డు కోశాధికారిగా వ్యవహరించిన అరుణ్ ధుమాల్ ..ఐపీఎల్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ముంబై క్రికెట్ సంఘం ప్రతినిధి అశీష్ షెలార్ బీసీసీఐ సరికొత్త కోశాధికారి కానున్నారు.
బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎంపికకానున్నారు. కొత్తకార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొనే అవకాశం ఎక్కువగా ఉంది.
గంగూలీతో సంప్రదించే కొత్తకార్యవర్గం..
బీసీసీఐ చైర్మన్ గా గత మూడేళ్లుగా అసమానసేవలు అందించిన సౌరవ్ గంగూలీతో పూర్తిస్థాయిలో చర్చించిన తరువాతే కొత్తకార్యవర్గానికి రూపకల్పన చేసినట్లు బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్ చెప్పారు.
గంగూలీ అంటే తమకు అపారగౌరవమని, దాదా నేతృత్వంలో బోర్డుకు అదనపు ఆదాయం సమకూర్చి పెట్టామని, ఐపీఎల్ లో సరికొత్తగా మరో రెండు ఫ్రాంచైజీలు వచ్చి చేరాయని, ప్రసారహక్కుల ద్వారా మరింతగా ఆర్జించి పెట్టామని అరుణ్ ధుమాల్ గుర్తు చేశారు.
కరోనా క్లిష్టసమయంలో సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా తమ కార్యవర్గం విలక్షణ సేవలు అందించినట్లు గుర్తు చేశారు. బీసీసీఐ చరిత్రలో అధ్యక్షుడిగా ఏ ఒక్కరూ వరుసగా రెండుసార్లు కొనసాగలేదని, అదో సాంప్రదాయంగా ఉంటూ వస్తోందని...ఆ సాంప్రదాయన్ని గౌరవిస్తూ దాదా వైదొలగినట్లు వివరించారు.
బోర్డు చైర్మన్ గా దాదా నిష్క్ర్రమణ వెనుక రాజకీయాలు, రాజకీయ కారణాలు లేనేలేవని, అవి కేవలం కట్టుకథలు, ఊహాగానాలు మాత్రమే నని అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు.