ఐపీఎల్ -17లో 200 స్కోర్ల సరికొత్త రికార్డు!

ఐపీఎల్ -2024లో 200కు పైగా స్కోర్లలో ఆల్ టైమ్ గ్రేట్ రికార్డు నమోదయ్యింది. వివిధ జట్లు అలవోకగా ద్విశతక స్కోర్లను అలవోకగా సాధించగలుగుతున్నాయి.

Advertisement
Update:2024-05-08 17:00 IST

ఐపీఎల్ -2024లో 200కు పైగా స్కోర్లలో ఆల్ టైమ్ గ్రేట్ రికార్డు నమోదయ్యింది. వివిధ జట్లు అలవోకగా ద్విశతక స్కోర్లను అలవోకగా సాధించగలుగుతున్నాయి.

దేశంలోని వివిధ నగరాలకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ వేదికల్లో రౌండ్ రౌండ్ కూ... హాటు హాటుగా సాగిపోతున్న ఐపీఎల్ -17వ సీజన్లో బ్యాటర్ల విశ్వరూపం, బౌలర్ల ఊచకోత అడ్డుఅదుపూలేకుండా సాగిపోతోంది.

ఒకప్పడు టీ-20 ఫార్మాట్లో 200 స్కోరు అంటే..అవునా..నిజమేనా? అని అభిమానులు అనుకొంటూ ఉండేవారు. అయితే ..ప్రస్తుత సీజన్ ఐపీఎల్ లో మాత్రమే వివిధ జట్లకు 200కు పైగా స్కోర్లు సాధించడం మంచినీటి ప్రాయంగా మారిపోయింది.

ముందుగా బ్యాటింగ్ కు దిగినా..లేదా చేజింగ్ కు దిగినా 200కు పైగా స్కోర్లు సాధించడం సాధారణ విషయమైపోయింది.

బ్యాటుకు జై....బంతికి నై....

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా..బ్యాటర్లకూ, బౌలర్లకూ విజేతగా నిలవటానికి సమాన అవకాశం ఉండాలి. అయితే..వినోదమే ప్రధానంగా సాగిపోయే లీగ్ క్రికెట్లో మాత్రం బ్యాటుకూ..బంతీకి మధ్య సమతూకం లేకుండా పోతోంది. నిబంధనలన్నీ బ్యాటర్లకు అనుకూలం కావడంతో బౌలర్లు బలిపశువులుగా మారిపోయారు.

బ్యాటర్ బాదడానికి..బౌలర్ బాదించుకోడానికే ఉన్నారన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది.

ఢిల్లీ, రాజస్థాన్ జట్ల 200 స్కోర్ల వార్..

న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల నడుమ జరిగిన సీజన్ 56వ మ్యాచ్ లో సైతం రెండుజట్లూ 200కు పైగా స్కోర్లు నమోదు చేయగలిగాయి.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు సాధిస్తే...చేజింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ సైతం 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగుల స్కోరుతో 20 పరుగుల పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

ఈ రెండుజట్లూ..200కు పైగా స్కోర్లు సాధించడంతో ఐపీఎల్ 17 సీజన్ల చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైనట్లయ్యింది. లీగ్ దశ మొదటి 56 మ్యాచ్ ల్లోనే ఓ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ 200కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇది 13వసారి.

2023 సీజన్లో 12సార్లు మాత్రమే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ 200 స్కోర్లు నమోదయ్యాయి. 2022లో 5 సార్లు, 2008, 2010, 2018, 2020 సీజన్లో నాలుగుసార్లు చొప్పున 200 స్కోర్లు రెండు ఇన్నింగ్స్ లోనూ నమోదు కావడం విశేషం.

2014, 2021లో మూడేసి సార్లు, 2017, 2019 సీజన్లలో రెండేసిసార్లు, 2011, 2012, 2016 సీజన్లలో ఒక్కోసారి మాత్రమే 200కు పైగా స్కోర్లు రెండు ఇన్నింగ్స్ లోనూ నమోదయ్యాయి.

2009, 2013, 2015 సీజన్లలో మాత్రం కనీసం ఒక్క మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ 200 స్కోర్లు నమోదు కాలేదు.

అందుకే ఈ 200 స్కోర్లు.....

ప్రస్తుత ఐపీఎల్ లో నిబంధనలతో పాటు..మ్యాచ్ కోసం సిద్ధం చేస్తున్న పిచ్ లు సైతం బ్యాటింగ్ కు అనువుగా రూపొందిస్తున్నారు. బౌలర్లకు ఏమాత్రం అనుకూలం కాని పిచ్ లను తయారు చేస్తున్నారు. వికెట్ల కంటే తమకు పరుగులే ప్రధానం అన్నట్లుగా క్యూరేటర్లు పిచ్ లను రూపొందిస్తున్నారు.ప్రస్తుత (17వ ) సీజన్ లీగ్ మొదటి 56 మ్యాచ్ లు ముగిసే సమయానికి వివిధజట్లు 28 సార్లు 200కు పైగా స్కోర్లను సాధించడం ఓ ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది.

2009 నుంటి 2023 మధ్యకాలంలో ఒకే ఒక్కసారి ( 2013లో పూణే వారియర్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 263 పరుగుల స్కోరు ) 260కి పైగా స్కోరు నమోదయితే..ప్రస్తుత 2024 సీజన్లో ఇప్పటికే 7సార్లు 260, ఆ పైన స్కోర్లు వచ్చాయి

టీ-20 క్రికెట్ ఆవిర్భావం తరువాత 7సార్లు మాత్రమే 500కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. అంటే బౌలర్లు సగటున ఓవర్ కు 10 పరుగులు చొప్పున ఇచ్చినట్లుగా రికార్డు ఉంది.

చేజింగ్ లోనూ అదేజోరు....

200కు పైగా విజయలక్ష్యాలను చేధించడంలో ప్రస్తుత సీజన్ మొదటి 44 మ్యాచ్ ల్లో 7సార్లు వివిధ జట్లు సఫలం కాగలిగాయి. ప్రస్తుత సీజన్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హైదరాబాద్ సన్ రైజర్స్ నిలిచింది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన పోరులో సన్ రైజర్స్ 287 పరుగుల స్కోరు, బెంగళూరు ప్రత్యర్థిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో 277 పరుగుల స్కోర్లతో రికార్డుల మోత మోగించింది.

42 మ్యాచ్ ల్లోనే సిక్సర్లసునామీ..

ప్రస్తుత సీజన్ లీగ్ మొదటి 42 మ్యాచ్ ల్లోనే 700కు పైగా సిక్సర్లు నమోదయ్యాయి. గత సీజన్ ఐపీఎల్ లో 1124 సిక్సర్లు మాత్రమే రాగా..ప్రస్తుత సీజన్ సగం మ్యాచ్ ల్లోనే 700 సిక్సర్లు రావడం విశేషం.

బ్యాటర్లకు అనువుగా తయారు చేసిన జీవం లేని పిచ్ లతో పాటు..ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన సైతం 200కు పైగా స్కోర్లకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

క్రికెటర్లు అంటే బౌలర్లు, బ్యాటర్లూ కలసి ఆడే ఆటే. సాధారణంగా ఇటు బౌలర్లకు, అటు బ్యాటర్లకూ సమప్రాధాన్యమిస్తూ నిబంధనలు, పిచ్ లను రూపొందించడం మామూలు విషయం. అయితే..క్రికెట్లో వినోదం కోసం బౌలర్లను బలిపశువులను చేస్తూ బ్యాటర్లకు అనుకూలంగా నిబంధనలు రూపొందించడం తీవ్రచర్చనీయాంశంగా మారింది.

బౌలర్ అన్న పదానికి నిర్వచనం కూడా..బాదించుకొనేవాడు అన్నట్లుగా మారిపోయింది.

కురచ బౌండ్రీ లైన్లకు తోడు..జీవంలేని పిచ్ లు తయారు చేయటం బౌలర్లపాలిట శాపంగా మారిందంటూ మహ్మద్ సిరాజ్, జస్ ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ బౌలర్లు వాపోతున్నారు. బౌలర్లను కాపాడంటూ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సైతం తనదైన శైలిలో సందేశాలు పెడుతూ కలకలకం రేపుతున్నాడు.

ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే బ్యాటుకు బంతికీ నడుమ సమతూకం ఉండేలా నిబంధనలు రూపొందించాలంటూ భారత మాజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పిలుపునిచ్చాడు.

బంతిమీద బ్యాట్ సంపూర్ణ ఆధిపత్యం ఏవిధంగానూ సమర్థనీయం కాదని తేల్చి చెప్పాడు. బౌలర్లు చేతులు కట్టేసి..బ్యాటర్లు వీరబాదుడు బాదుతుంటే..అభిమానులు ఆ ఏకపక్ష వినోదాన్ని చూస్తూ మైమరచిపోతుంటే...నిర్వాహక సంఘం వినోదం పేరుతో జేబులు నింపుకోడం ఫక్తు వ్యాపారం కానీ..పెద్దమనుషుల క్రీడ క్రికెట్ అని ఏమాత్రం అనిపించుకోదు.

Tags:    
Advertisement

Similar News